ఎంఐఎంకు కెసిఆర్ ఎందుకు భయపడుతున్నారు !

ఎంఐఎంకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎద్దేవాచేశారు. కేసీఆర్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ధ్వజమెత్తారు. నిర్మల్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ ఎంఐఎంకు భయపడి కేసీఆర్‌ సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించడం లేదని ద్వజమెత్తారు. సెప్టెంబర్‌ 17ను బీజేపీ మాత్రమే అధికారికంగా నిర్వహిస్తుందని ఆయన చెప్పారు.

గతంలో హిందూ దేవతలను అవమానిస్తూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ మాట్లాడారని, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అమిత్‌షా మండిపడ్డారు. రజాకార్లను, నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసిచూపుతామని భరోసా ఇచ్చారు.

ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించబోతున్నాయని చెప్పారు. గతంలో నిర్మల్‌లో ఎన్నో పరిశ్రమలు నడిచేవని, ఇప్పుడు నిర్మల్‌లో పరిశ్రమలు మూతపడ్డాయని తెలిపారు. పరిశ్రమల మూసివేతకు కారణం ఎవరో ప్రజలు ఆలోచించాలని అమిత్‌షా కోరారు.

‘ప్రతి ఇంటికీ గోదావరి నీటిని తీసుకొస్తానని చెప్పిన కేసీఆర్‌ ఆ పనిచేయలేకపోయారు. తెలంగాణకు వచ్చిన ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్‌ చెప్పారు. ఐదేళ్లు అయినా వాటిని భర్తీ చేయలేదు. నాలుగేళ్లలో 4,500 మంది రైతులు తెలంగాణ వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్నారు. కొండగట్టు దుర్ఘటనలో 65 మంది చనిపోతే వెళ్లడానికి కేసీఆర్‌కు సమయం లేదని అంటూ కెసిఆర్ వైఫల్యాలను వివరించారు.

 ఒవైసీ సోదరులతో బిర్యానీ తినడానికి మాత్రం సమయం ఉంటుందా? దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అవసరమా? అంటూ కెసిఆర్ ను నిలదీసారు. అన్ని పార్టీలు కలిసినా బిజెపి కేంద్రంలో ఉన్నంత వరకు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేసారు.

కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్‌ కూడా ఇక్కడ పర్యటిస్తున్నారని అంటూ అన్ని పార్టీలతో కలుస్తున్నారని, చాలా రాష్ట్రాల్లో ఇలానే ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేసారు. అయినా అన్ని రాష్ట్రాల్లో ఓటమి పాలయ్యారని అంటూ రోజురోజుకూ ఆ పార్టీ కనుమరుగవుతోందని స్పష్టం చేసారు.

ముందస్తు ఎన్నికల వల్ల తెలంగాణ ప్రజలపై అదనపు భారం పడుతోందని వరంగల్ జిల్లా పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ చెప్పారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులను గెలిపించుకోవడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, బీసీ కమిషన్‌కు మోదీ చట్టబద్ధత కల్పించారని ఆయన కొనియాడారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించబోతున్నాయని చెప్పారు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ... కేసీఆర్‌ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అమిత్‌షా మండిపడ్డారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.