కేంద్ర మాజీ మంత్రి జాఫర్ కన్నుమూత

కేంద్ర రైల్వేశాఖ మాజీ మంత్రి సీకే జాఫర్‌ షరీఫ్‌(85) కన్నుమూశారు. శుక్రవారం కారు ఎక్కుతుండగా ఛాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. అనంతరం ఆయనను బెంగళూరులోని కన్నింఘామ్‌ రోడ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటి నుంచి ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదు. దీంతో ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు.

అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి నిజలింగప్ప హయాంలో కాంగ్రెస్‌ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక పదవులు చేపట్టిన జాఫర్‌ షరీఫ్‌ 1980 నుంచి 1984 మధ్య రైల్వే సహాయ మంత్రిగా పనిచేశారు. నీటిపారుదల, బొగ్గు మంత్రిత్వ శాఖలనూ ఆయన చేపట్టారు. పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు (1991-95) కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో చివరిసారిగా ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి చెందిన డీబీ చంద్రగౌడ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.

మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ రాసిన ‘ఇండియా విన్స్‌ ఫ్రీడమ్‌’ పుస్తకాన్ని ఉర్దూలోకి అనువదించారు. ఆ గ్రంధం ఈ వారంలో విడుదల కావలసి ఉంది. ఆయనకు ఆర్ ఎస్ ఎస్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. పలువురు అగ్ర నాయకులతో పరిచయాలు ఉన్నాయి. ఆ సంస్థ చేపట్టే సామాజిక సేవా కార్యక్రమలకు మద్దతు ఇస్తూ ఉండేవారు.

కాంగ్రెస్ సీనియర్‌ నేత మరణంపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీలో ఇది మరో భయంకరమైన రోజు. కర్ణాటక కాంగ్రెస్‌ కుటుంబంలో సీనియర్‌ సభ్యులు జాఫర్‌ షరీఫ్‌ ఈ రోజు మనకు దూరమయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

రైల్వే మంత్రిగా కర్ణాటకలో రైల్వే వ్యవస్థ విస్తరణకు షరీఫ్ తీవ్ర కృషి చేశారు. బెంగళూరుకు రైల్వే వీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్‌ను తీసుకురావడంలో షరీఫ్ కీలక పాత్ర పోషించారు.