ఆసియాలోనే చంద్రబాబు అవినీతి చక్రవర్తి!

ఆసియా రాజకీయాల్లోనే చంద్రబాబునాయుడు ఒక అవినీతి చక్రవర్తి అని భారతీయ జనతా పార్టీ ఎపి ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం భూ కుంభకోణంపై బీజేపీ తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం కోటిపల్లిబస్టాండ్ వద్ద నిర్వహించిన భూరక్షణ‘దీక్ష’లో పాల్గొంటూ  అవినీతికి ఒక రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. 1995లో ఎన్టీఆర్‌ను వెన్నుపొటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చంద్రబాబు అవతారమెత్తారని ద్వజమెత్తారు.

రైతుల నుంచి బలవంతంగా సేకరించి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంలో ఆయన సిద్ధహస్తుడని ఎద్దేవా చేసారు. 1995 నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు పేరిట అభివృద్ధి ముసుగులో భూమాయకు పాల్పడ్డారని గుర్తు చేసారు. రింగు రోడ్డుపక్కన స్థానిక పార్లమెంటు సభ్యుడికి చెందిన జయభేరి రియల్ ఎస్టేట్‌తో పాటు తన తాబేదార్లు పలువురికి భూములు కేటాయించారని ఆరోపించారు. ఆ భూముల కారణంగానే వారంతా కోట్లకు పడగలెత్తారని పేర్కొన్నారు. కృష్ణపట్నం, కెఎస్‌ఈజడ్, విశాఖలోని ప్రైవేటు పోర్టు తదితరచోట్ల తన బినామీలకు భూములు కేటాయించే ప్రక్రియ ఎపుడో మొదలు పెట్టారని గుర్తు చేసారు.

2014లో చంద్రబాబునాయుడు తన విశ్వరూపాన్ని మరింతగా బయట పెట్టుకున్నారని అంటూ రాజధానికి ప్రాధాన్యత సృష్టించి, రైతులను మాయచేసి మూడు పంటల భూములు 40 వేల ఎకరాలు సేకరించారని తెలిపారు. తన అనుచరులకు ఎక్కడ రాజధాని వస్తుందో ముందేచెప్పి, అక్కడ వారంతా భూములు కొనుగోలుచేసేలా పథకం పన్నారని చెప్పారు.  ఇలా సుమారు రూ.50వేల కోట్ల విలువైన భూములు ఆయన అనుచరులు కొట్టేశారని సోము వీర్రాజు ఆరోపించారు.

అనేక సంస్థలు వస్తున్నాయని నమ్మిస్తూ, వాయిదాల పద్ధతిలో రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రభుత్వం సేకరించిన భూములను దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారని వీర్రాజు మండిపడ్డారు. అలాగే మచిలీపట్నం పోర్టుకు పది వేల ఎకరాలు సేకరించి ఈ భూములను ప్రైవేటు వారికివ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని ద్వజమెత్తారు. అవసరానికి మించి రైతుల భూములను బలవంతంగా లాక్కోవడంవల్ల వారంతా రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రపంచంలో ఎయిర్‌పోర్టులకు బాబు మాదిరి వేలాది ఎకరాలు సేకరించే తీరు ఎక్కడా లేదని స్పష్టం చేసారు.

చంద్రబాబునాయుడు భూజబ్బు పట్టుకుని, ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చేశారని ఆరోపించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ సాప్ట్‌వేర్ కంపెనీలకు భూములు ఐదేళ్ల తర్వాత అమ్మేసుకునే విధంగా కేటాయిస్తున్నారని దయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని, భూ కుంభకోణాలు, అగ్రిగోల్డ్ వ్యవహారాలపై ప్రజల్లో ఆలోచన రేకెత్తించడానికి బీజేపీ కృషిచేస్తోందని సోము వీర్రాజు తెలిపారు. తాను చేస్తున్న అవినీతికి భయపడే సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా తీర్మానం చేసుకున్నారన్నారు. ఇది దొంగచేతికి తాళాలు ఇచ్చినట్టుగా, అవినీతి చుట్టూ తాళం వేసుకున్నట్టుగా ఉందని ఎద్దేవాచేశారు.