చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడే సమయం

చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం అసన్నమైందని బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపిచ్చారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ రోడ్‌లో బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన భూ పరిరక్షణ దీక్షలో పాల్గొంటూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి మాటున పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తగు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా కొల్లగొడుతున్న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడని స్పష్టం చేసారు.

 ‘చంద్రబాబును భూదాహం, ధనదాహం అనే మానసిక రోగాలు పీడిస్తున్నాయి. అమరావతి భూములు, కాకినాడ సెజ్‌, భోగాపురం విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు తదితర విషయాల్లో ప్రజలు, రైతుల పొట్టకొట్టి పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారు’ అంటూ కన్నా తీవ్రమైన ఆరోపణలు చేసారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ ఆస్తుల విలువ గత నాలుగేళ్లలో రూ.వేల కోట్లకు పెరగ్గా, అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ మాత్రం గత నాలుగేళ్లలో పదింతలు దిగజారినట్టు చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేసారు.

బంధుప్రీతి పాలన సాగిస్తూ తన కొడుకు లోకేష్, తన అనుయాయుల ఆస్తులు పెంచడానికే చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రానికి చేదోడువాదోడుగా నిలిచిన కేంద్రాన్ని విమర్శిస్తూ 2019 ఎన్నికల్లో తెలుగు ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబట్టే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకున్నది ప్రధాని నరేంద్ర మోదీయేనని స్పష్టం చేసారు. ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులను ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిందని చెప్పారు.

చట్టాలను తనకు అనుకూలంగా మలుచుకుని పేద, బడుగు వర్గాల భూములను కాజేస్తున్నారంటూ ద్వజమెత్తారు. ముఖ్యమంత్రి నివాసం చుట్టూ పెద్ద ఎత్తున అధికార పార్టీ నేతలు ఇసుక దందా సాగిస్తున్నా చంద్రబాబుకు కనిపించడం లేదని దయ్యబట్టారు.  వాన్‌పిక్‌ కుంభకోణంలో పాత్రధారులు జైలు పాలయ్యారని, అదే పరిస్థితి చంద్రబాబు, ఆయన అనుయాయులకు తప్పదని హెచ్చరించారు. మచిలీపట్నంలో పోర్టు సాధ్యం కాదంటూ గతంలో సంతకం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 33 వేల ఎకరాలకు ఎందుకు నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేసారు. స్థానిక శాసనసభ్యుడు, మంత్రి కొల్లు రవీంద్ర సైతం గతంలో పోర్టుకు 1,600 ఎకరాలు చాలంటూ ఆందోళన చేసిన సంగతి ప్రజలు మరవలేదని పేర్కొన్నారు.

ప్రత్యేక అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్‌ దియోధర్‌ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గొప్ప ఆశయాలతో మహానాయకుడు ఎన్టీఆర్‌ స్థాపించిన టిడిపిని చంద్రబాబు అదేపార్టీతో జత కట్టించడం సిగ్గుచేటని విమర్శించారు. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని ద్వజమెత్తారు. చంద్రబాబు పాలన పట్ల యావత్తు ఆంధ్రప్రదేశ్ రైతులు, మహిళలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు.  కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన చంద్రబాబు కాంగ్రెస్ వాదులతోనే కూటమి తయారు చేస్తున్నారని ఎద్దేవా చేసారు. చంద్రబాబుతో సహా శరద్ పవార్, మమతా బెనర్జీలు కాంగ్రెస్‌ను వీడిన వారేనని గుర్తు చేసారు.

 స్వా ర్థ రాజకీయాల కోసం జన్మనిచ్చిన కాంగ్రెస్ పంచనే వారంతా తిరిగి చేరడాన్ని యావత్తు దేశ ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ పోర్టు పేరిట పేదవర్గాల భూముల్ని గుంజుకోవాలని చూస్తుండటం హేయమని మండిపడ్డారు.