మొండి బకాయిలపై తీవ్రమైన బ్యాంకుల యుద్ధం

మొండి బకాయిలపై ప్రభుత్వరంగ బ్యాంకుల యుద్దాన్ని తీవ్రతరం చేశాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొండి ఖాతాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న పీఎస్‌బీలు ఎట్టకేలకు కొరడా జులిపించాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.36,500 కోట్ల బకాయిలను ముక్కుపిండి వసూలు చేశాయి. అంతక్రితం ఏడాది మొత్తానికి వసూలు చేసిన దాంట్లో సగం కేవలం మూడు నెలల్లో వసూలు చేయడం విశేషం.

2017-18 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.74,562 కోట్ల మేర ప్రధాన ఐదు బ్యాంకులు వసూలు చేశాయి. వీటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ), ఇండియన్ బ్యాంకులైతే అత్యధికంగా మొండి ఘటాల మెడలు వంచి వసూలు చేశాయని ఒక నివేదిక వెల్లడించింది. అలాగే బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ)లు కూడా ఆకర్షణీయ స్థాయిలోనే వసూళ్లు చేశాయి.

అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వసూలైన దాంతో పోలిస్తే ఎస్‌బీఐ మూడున్నరెట్లు అధికంగా రూ.2,426 కోట్ల వసూళ్లు చేసింది. అలాగే బీవోబీ, బీవోఐల వసూళ్లు కూడా రెండు రెట్లు పెరిగాయి.

మొండి బకాయిలపై అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వు బ్యాంక్ కట్టుదిట్టమైన చర్యలకు అనుగుణంగానే బ్యాంకులు జూలువిధిస్తున్నాయి. మార్చి 31, 2018 నాటికి రూ.10.25 లక్షల కోట్లుగా ఉన్న పీఎస్‌బీల మొత్తం నిరర్థక ఆస్తుల విలువ జూన్ చివరినాటికి రూ.10 లక్షల కోట్లకు తగ్గాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు చోధక శక్తిగా ఉన్న పీఎస్‌బీలను మొండి బకాయిలు లేని వాటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

దివాల చట్టానికి లోబడి కఠిన చర్యలు తీసుకుంటుండటంతో రుణాలు తీసుకొన్ని ఎగ్గొట్టిన వారిలో భయం కనపడుతున్నదని, దీంతో వారిపై చర్యలు తీసుకోవడానికి ముందే చెల్లింపులు జరుపుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంట్లోభాగంగా భూషణ్ స్టీల్ అండ్ ఎలక్ట్రోస్టిల్ స్టీల్స్ నుంచి పూర్తి స్థాయిలో వసూలు చేయగలిగామని చెప్పారు. ఈ ఏడాది ఎస్‌బీఐ రూ.50 వేల కోట్లను, పీఎన్‌బీ రూ.20 వేల కోట్ల మొండి బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.