నేడే తెలంగాణలో అమిత్ షా ఎన్నికల ప్రచారం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలతో అనూహ్యంగా ఉత్తర భారతంలో విజయాలు సాధించిన ఆ పార్టీ దక్షిణాదిలో పాగా వేసే క్రమంలో తెలంగాణ శాసనసభ ఎన్నికలకు వ్యూహ రచన చేస్తోంది. ఈ క్రమంలో అమిత్ షా ఆదివారం నాడు తెలంగాణకు రానున్నారు. అమిత్ షా మూడు విడతలుగా నాలుగు రోజుల పాటు వివిధ బహిరంగ సభల్లోనూ, రోడ్ షోల్లో పాల్గోంటారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 27, డిసెంబర్ 3వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

ఇప్పటికే మహబూబ్‌నగర్, కరీంనగర్ , హైదరాబాద్ సభల్లో పాల్గొన్న అమిత్ షా 25న రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పరకాల, నిర్మల్, నారాయణ్ ఖేడ్, దుబ్బాక సెంటర్‌లలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.

ఆదివారం ఉదయం 10.20కి హైదరాబాద్ చేరుకుంటున్న అమిత్ షా తిరిగి రాత్రి 6.45 గంటలకు బేగం పేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఇండోర్‌కు వెళ్తారు. హైదరాబాద్ చేరుకున్న వెంటనే అమిత్ షా వరంగల్ జిల్లా పరకాలలోని అంగడి వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం అక్కడి నుండి నిర్మల్‌లోని విశ్వనాధపేట వద్ద ఉన్న ప్రిన్స్ హైస్కూల్ గ్రౌండ్ వద్ద జరిగే సభలో పాల్గొంటారు అనంతరం సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ అనురాధ కాలేజీ గ్రౌండ్స్ సమీపంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

సాయంత్రం సిద్దిపేట దుబ్బాక వేంకటేశ్వర బీఈడీ కాలేజీ సమీపంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ పర్యటన అనంతరం ఆయన ఇండోర్‌కు వెళ్లి తిరిగి 28న మరో మారు రాష్ట్రానికి వస్తారు. ఉదయం 10.30కి ఆయన హైదరాబాద్ చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్ వెళ్తారు. అక్కడ 12 గంటలకు జరిగే సభలో పాల్గొంటారు. తర్వాత రెండు గంటలకు జరిగే చౌటుప్పల్ సభలో పాల్గొని హైదరాబాద్‌కు వస్తారు.

హైదరాబాద్ లో మధ్యాహ్నం 3.45 తర్వాత హిమాయత్ నగర్ లిబర్టీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకూ జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. అనంతరం ఆయన ఎల్బీనగర్ రోడ్‌షోలో కూడా పాల్గొంటారు. నవంబర్ 27న నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారు.

డిసెంబర్ 3న ప్రధాని నరేంద్రమోదీ మరోమారు హైదరాబాద్ వస్తారు, ఆ రోజు ఎల్బీస్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారు. యోగీ ఆదిత్యనాధ్, రాజ్‌నాధ్ సింగ్ అనేక మంది జాతీయ నాయకులు కుడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.