సిఎంలు ఎవరైనా మాకు తలవంచాల్సిందే : ఒవైసీ

ముఖ్యమంత్రులు ఎవ్వరైనా తమ ముందు తలవంచాల్సిందే అంటూ ఇప్పుడు కెసిఆర్ ప్రభుత్వం, ఇది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తమ కన్నుసన్నలలోనే నడుస్తున్నట్లు మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ చెప్పకనే చెప్పారు. `నేను బాద్షాను కాదు. కానీ కింగ్‌ మేకర్‌ని’ అంటూ మళ్ళి కెసిఆర్ సిఎం అయితే తాను ఆడించిన్నట్లు ఆడవలసిందే అంటూ స్పష్టమైన సంకేతం ఇచ్చారు.

ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా తమ ముందు వంగి సలాం కొట్టినవారేనని చెబుతూ  దివంగత సీఎం వైఎ స్సార్, ఏపీ సీఎం చంద్రబాబు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు, ప్రస్తుతం కేసీఆర్‌ అందరూ తమ మాటలను విన్నారనీ కాదు.. వినాల్సిందే అని స్పష్టం చేసారు. తద్వారా బిజెపి కాకుండా ఏ పార్టీ గెలిచినా తమ చెప్పు చేతలలో ఉండ వలసిందే అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు.

పైగా, ఎవర్నయినా సీఎం పీఠంపై కూర్చోబెట్టగలనని, దించేయడమూ చేయగలనని కుడా అహంకార పూరిత వాఖ్యలు చేసారు. డిసెంబరు 11న కింగ్‌ మేకర్‌ ఎవరో తేలిపోతుందని అంటూ తమ దయాదాక్షిణ్యాల పైననే ఇక్కడ ప్రభుత్వం ఎర్పడవలసిందే అంటూ చెప్పుకొచ్చారు.

పాతబస్తీ బండ్లగూడ మహ్మద్‌నగర్‌లో జరిగిన మజ్లిస్‌ పార్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేయడంతోపాటు కాంగ్రెస్‌, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మేము ఐదు రోజులు రాష్ట్రమంతా పర్యటిస్తే తెలంగాణలో మా గాలి వీస్తుందని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీకి చుక్కలు చుక్కలు చూపిస్తా. గాంధీ టోపీ ధరించే గాంధీ బానిసలారా(గాంధీ టోపీ పహన్‌నే వాలో..గాంధీకే గులామో) మీకు ఇదే నా హెచ్చరిక. సోనియా దగ్గర గులాంగిరీ చేయాల్సిన ఖర్మ మాకు పట్టలేదు. సఖ్యత కోసం ఆనాడు ఇందిరాగాంధీ దారుస్సలాంకు వచ్చారు. మజ్లిస్‌ పార్టీ శక్తి అది’’ అని వ్యాఖ్యానించారు.

అవసరం ఉంటే మీ నానమ్మ (ఇందిరాగాంధీ) లాగానే మీరూ దారుస్సలాంకు రావాల్సిందేనని రాహుల్‌గాంధీకి పరోక్షంగా సూచించారు. మజ్లిస్‌ పార్టీ ఎవరినీ లెక్క చేయదని, ఎట్టి పరిస్థితుల్లో భయపడదని స్పష్టం చేసారు. సందర్భం వస్తే ఒకవైపు మోదీతో మరోవైపు గాంధీ టోపీలతో పోరాడతామని హెచ్చరించారు. దేశానికి కాంగ్రెస్‌, భాజపాలే ప్రత్యామ్నాయమా? వాటితో జత కలిస్తేనే మా మాట వింటాయా? అని ఎదురు ప్రశ్నించారు.

తాము ఎవరో ఒకరితో స్నేహం చేస్తామనే భావన కాంగ్రెస్‌, బిజెపిలకు ఉందని, అందుకే ప్రత్యామ్నాయంగా మూడో శక్తికి జీవం పోస్తున్నామని చెబుతూ పరోక్షంగా టీఆర్‌ఎస్‌ ను ఆటబొమ్మగా చేస్తూ తాము అడిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకరు తమాషాలు చేస్తే మరొకరితో జతకట్టడమే మజ్లిస్‌ రాజకీయమని చెప్పారు. గతంలో కూడా అసదుద్దీన్‌ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కారు ఇటు రావద్దని, ఆ స్టీరింగ్‌ తన చేతిలో ఉందని ఎటు తిప్పాలో అటు తిప్పుతామని పేర్కొనడం తెలిసిందే.