టీడీపీ నేత సుజనా చౌదరికి ఈడీ సమన్లు

బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి చుట్టు ఉచ్చు బిగుస్తోంది. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా గ్రూప్‌ బీసీఈపీఎల్‌కు చెందిన కంపెనీలపై చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరులోని ఆఫీసుల్లో రెండు రోజులుగా ఈడీ సోదాలు నిర్వహించిన అనంతరం సమన్లు జారీ చేరింది. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ పేర్కొంది.

సుజనా చౌదరి మొత్తం 120 డొల్ల కంపెనీలు సృష్టించి, బ్యాంకుల నుంచి ఏకంగా రూ. 5,700 కోట్లు కొల్లగొట్టారని ఈడీ వెల్లడించింది. ఇప్పటికే సుజనా చౌదరి అక్రమాలపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. పలు విడతలుగా సుజనా కార్యాలయాలపై ఈడీ, సీబీఐ దాడులు జరిపింది. టీడీపీకి ఆర్థిక వనరుగా పేరొందిన సుజనా నిన్నమొన్నటివరకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయనపై ఇప్పటికే డీఆర్‌ఐ, ఫెమా, సీబీఐ కేసులు ఉన్నాయి.

సుజనాకు బినామీ పేర్లతో ఉన్న ఫెరారీ, రేంజ్‌ రోవర్‌, బెంజ్‌ తదితర ఆరు కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  నాగార్జున హిల్స్‌లో ఉన్న సుజనా కంపెనీపై శుక్రవారం అర్ధరాత్రి వరకు ఈడీ తనిఖీలు కొనసాగాయి. గత అక్టోబర్‌లోనూ ఆయన కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి సుజనా చౌదరి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన కంపెనీ ఉద్యోగులను డైరెక్టర్లుగా పెట్టి షెల్‌ కంపెనీలు ఆయన ప్రారంభించినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌లోని కార్యాలయం నుంచి షెల్‌ కంపెనీలకు చెందిన 126 రబ్బర్‌ స్టాంప్స్‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సుజనా గ్రూప్‌లోని కంపెనీలన్నీ సుజనా చౌదరి ఆదేశాలమేరకే నడుస్తున్నాయని గుర్తించామని చెప్పారు. కంపెనీలపై ఫెమా, డీఆర్‌ఐ కేసులున్నాయని పేర్కొన్నారు.

గంగా స్టీల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, భాగ్యనగర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌, తేజస్విని ఇంజినీరింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఫ్యూచర్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌ తదితర డొల్ల కంపెనీలకు ఆయన పెద్ద ఎత్తున డబ్బు తరలించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే కేవలం రశీదుల రూపంలో భారీగా డబ్బుగా మళ్లించినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ ఆరోపణలపై 2016 ఫిబ్రవరిలోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో 2017 ఫిబ్రవరి, 2018 జులైలో మరోసారి ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసింది. గత అక్టోబర్‌లో ఈ కేసులకు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహించి, పెద్ద ఎత్తున హార్డ్‌డిస్క్‌లు, ఫైల్స్‌తోపాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఇక, మూడు బ్యాంకుల నుంచి రూ. 304 కోట్ల రుణం తీసుకొని, వాటిని దుర్వినియోగపరిచినట్టు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. బ్యాంకుల ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌లోనూ ఈ విషయం తేటతెల్లమైంది.

ఆయన బినామీ కంపెనీలు కేవలం రశీదులు రూపొందించి డబ్బు తరలించుకుపోయినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. గత మూడేళ్లుగా సాగుతున్న ఈ విచారణ ప్రస్తుతం కీలకదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈడీ చేసిన సోదాల్లోనూ పెద్ద ఎత్తున డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.