నన్ను ఎదుర్కోలేక మా అమ్మను తిడుతున్నారు : మోదీ

రూపాయి విలువ మోదీ తల్లి వయసును చేరిందంటూ కాంగ్రెస్‌ నేత రాజ్‌బబ్బర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. తనని ఎదుర్కునే సత్తా లేకనే కాంగ్రెస్‌ నేతలు తన తల్లిని దూషిస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌ నేతలకు సమస్యలపై మాట్లాడే సత్తా లేక ఇతరుల తల్లులపై అసభ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వారి మాటలు చూస్తుంటే మోదీని ఢీకొట్టలేని నిస్సహాయతలో ఉ‍న్నట్లు అర్ధమవుతుందని ఎద్దేవా చేసారు.

“గత 18ఏళ్లుగా.. నాకు అవకాశం వచ్చిన ప్రతీసారీ కాంగ్రెస్ పార్టీని ఓడించాను. నన్ను ధైర్యంగా ఎదుర్కొనే సత్తాలేక చివరికి నా తల్లిని కూడా ఎన్నికల్లోకి లాగే స్థాయికి ఆ పార్టీ దిగజారింది. కాంగ్రెస్.. మోదీతో పోరాడలేదు. అందుకే నా తల్లిని దూషిస్తున్నారు” అంటూ మండిపడ్డారు.

పోలింగ్‌ తేది సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్‌ నేతలకు భయం పట్టుకుందని, వారి డిపాజిట్లు గల్లంతు కావద్దనే మోదీ తల్లిని తిడుతున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీకి ప్రజలే హైకమాండ్‌ అని, తమది రిమోట్‌ ప్రభుత్వం కాదని, ప్రజా ప్రభుత్వమని పరోక్షంగా కాంగ్రెస్‌ నేతలకు చురకలంటించారు.

ఇండోర్‌లో గత గురువారం జరిగిన ర్యాలీలో రాజ్‌ బబ్బర్‌ ప్రసంగిస్తూ ‘ప్రధాని కాక ముందు మోదీ.. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై కనీస గౌరవం చూపకుండా రూపాయి విలువ ఆయన వయసుకు సమానంగా పడిపోయిందని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అదే రూపాయి మరింత పతనమై మోదీ తల్లి వయసును చేరింది’ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ తల్లి 90వ పడిలో ఉన్నారు.

ఇక, జైపూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్‌ నాయకుడు సీపీ జోషి మాట్లాడుతూ దిగువ కులానికి చెందిన మోదీ, బీజేపీ ఎంపీ ఉమా భారతి, హిందూ కార్యకర్త సాధ్వి రీతాంభరాలకు హిందూ మతం గురించి ఏమీ తెలియదని, బ్రాహ్మణులే పండితులని వారికే హిందూయిజం గురించి తెలుసని  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగడంతో సీపీ జోషి ట్విటర్‌ వేదికగా క్షమాపణలు చెప్పారు.

కాగా, ఛతుర్పూర్‌ రోడ్‌ షోలో పాల్గొంటూ  ‘కాంగ్రెస్‌కు నన్ను ఎదిరించే ధైర్యం లేదు. నా ఎదురుగా వచ్చి ఆపార్టీ నాయకులు ఎవరూ మాట్లాడలేరు. అందుకే వాళ్లు మా అమ్మ ప్రస్తావన తెచ్చారు. వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారు” అని హెచ్చరించారు. ఎంపి ప్రజలకు కాంగ్రెస్‌ పరిపాలన ఎలా ఉంటుందో బాగా తెలుసని, అన్నేళ్ల పాలనలో కాంగ్రెస్‌ ఏం చేసిందో చెప్పడానికి వాళ్లకు మాటలు రావని ఎద్దేవా చేసారు. కేంద్రంలో నాలుగు సంవత్సరాల తన పాలనకు నలభై సంవత్సరాల వారి పాలనకూ ఇప్పుడు పోటీ జరుగుతోందని స్పష్టం చేసారు.

రైతులకు సాగునీరు, యువతకు ఉద్యోగాలు, పిల్లలకు నాణ్యమైన విద్యే బిజెపి ధ్యేయం అని ప్రధాని మోదీ తెలిపారు. “మా లక్ష్యానికి ఎవరైనా అడ్డుగా వస్తే ఊరుకోం. అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. సంస్థలైనా, వ్యక్తులైనా సరే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు” అని హెచ్చరించారు. అవినీతికి మారుపేరైన కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడితే మధ్యప్రదేశ్‌ అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజలకు హితవు చెప్పారు. పదిహేనేళ్లలో ఈ రాష్ట్రాన్ని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఎంతో అభివృద్ధి చేశారని అంటూ “మీరు మళ్లీ అభివృధ్ధికే ఓటేస్తారని నా నమ్మకం. మధ్యప్రదేశ్‌ ప్రజలు అవినీతి వైపు వెళ్లరని అనుకుంటున్నాను” అని మోదీ భరోసా వ్యక్తం చేసారు.