ఆధార్ కు ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను

ఆధార్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో భాగంగా దశలవారీగా ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను వచ్చే నెల 15 నుంచి అమల్లోకి తెస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది. నిజానికి జూలై 1 నుంచే ఈ లైవ్ ఫేస్ ఫోటో క్యాప్చర్ సౌకర్యాన్ని అమలు చేయాలని అనుకున్నప్పటికీ,  ఆగస్టు 1కి వాయిదా పడింది. మళ్లీ ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి అమలు చేయనున్నారు. 

,ముందుగా టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లతో ఈ ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ ప్రకటించారు. సిమ్ కార్డుల జారీకి ముఖ గుర్తింపు ఫీచర్‌ను తప్పనిసరి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఓ సిమ్ కార్డు పంపిణీదారుడు వేల సిమ్‌లను యాక్టివేట్ చేయడానికి ఆధార్ వివరాల నకలును సృష్టించినది తెలిసిందే. ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌తో ఫింగర్‌ప్రింట్ స్పూఫింగ్, క్లోనింగ్‌ను నియంత్రిచవచ్చని భావిస్తున్నారు.

ఆధార్‌ కోసం ప్రస్తుతం ఐరిస్‌, వేలి ముద్రలను స్కాన్‌ చేస్తుండగా,  ఫేస్‌ రికగ్నిషన్‌కు కూడా జతచేయాలని గతేడాది ఉడాయ్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫింగర్‌ ప్రింట్‌తో కొన్ని ఇబ్బందులతో పాటు మోసాలు కూడా జరిగే అవకాశమున్నందున ఉడాయ్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఫింగర్‌ప్రింట్‌, ఐరిస్‌లతో ఆధార్‌ను ధ్రువీకరించేందుకు వీలులేని పక్షంలో ఈ ముఖ గుర్తింపు ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

సెప్టెంబరు 15 నుంచి మొత్తం నెలవారీ లావాదేవీల్లో కనీసం 10శాతం ఫేస్‌ రికగ్నిషన్‌తో ధ్రువీకరించాలని ఉడాయ్‌ ఆదేశించింది. లేదంటే ఒక్కో లావాదేవీకు 20 పైసల చొప్పున వసూలు చేస్తామని స్పష్టం చేసింది.