చంద్రబాబు అవినీతిపై జోక్యం చేసుకోండి గవర్నర్ గారు !

ఆంధ్రప్రదేశ్‌ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై జోక్యం చేసుకోవాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను బిజెపి ఎపి శాఖ కోరింది. రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ నేతృత్వంలో ఒక ప్రతినిధివర్గం గవర్నర్ ను కలసి టిడిపి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఇష్టారాజ్యంగా పాలన సాగుతోందని ఫిర్యాదు చేసింది.

వివిధ అంశాలపై ఇప్పటివరకు తాను 100 ప్రశ్నలు లేవనెత్తినా చంద్రబాబు ప్రభుత్వం సమాధానాలు చెప్పకుండా దాటవేత ధోరణి అవలంబిస్తోందని కన్నా ఆరోపించారు. ఈ వంద ప్రశ్నలతో బిజెపి ప్రచురించిన ఒక పుస్తకంతో పాటు, ఒక వినతి పత్రాన్ని కుడా  గవర్నర్ కు అందజేశారు.

గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలపై, ఇసుక దోపిడీ తదితర అవినీతి విషయాలపై కన్నా లక్ష్మీనారాయణ వారానికి ఐదు ప్రశ్నలు చొప్పున సంధించిన 100 ప్రశ్నలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వారానికి ఇదు ప్రశ్నలు చొప్పున ముఖ్యమంత్రిని ఉద్దేశించి కన్నా మీడియాకు విడుదల చేస్తున్నారు.

ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గాని, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కానీ, సంబంధిత మంత్రుల నుండి కానీ, అధికారుల నుండి కానీ ఎలాంటి సమాధానం రాలేదని బిజెపి నేతలు గవర్నర్ కు తెలిపారు. ఇదంతా చుస్తుంటీ కన్నా ప్రస్తావిస్తున్న అవినీతిని వారు సమర్ధించుకున్నట్లు ఉన్నదని పేర్కొన్నారు.

‘నేను బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు సీఎం చంద్రబాబుకు 100 ప్రశ్నలు సంధించా. టీడీపీ సర్కారు అవలంబిస్తున్న తప్పుడు విధానాలు, అవినీతి గురించి వేసిన ఆ ప్రశ్నలకు ఇప్పటి వరకు ఆయన నుంచి సమాధానం రాలేదు’’ అని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ‘మా ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చేలా చొరవ చూపాలని గవర్నర్‌ను కోరాం. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పగా చెప్పుకొనే చంద్రబాబు... తనను ప్రశ్నిస్తున్న వాళ్లపై కేసులు పెట్టిస్తున్నారు’’ అని ద్వజమెత్తారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారని పురందేశ్వరి విమర్శించారు.  `సేవ్‌ డెమోక్రసీ’ అంటూనే రాష్ట్రంలో సీబీఐని అనుమతించకపోవడం ఏంటి? అని ఆమె ప్రశ్నించారు.

కన్నా లక్ష్మీనారాయణతో పాటు కేంద్ర మాజీ మంత్రులు కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, రాష్ట్ర మాజీ మంత్రి మాణిక్యాలరావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్ సురేష్ రెడ్డి, వామరాజు సత్యమూర్తి, పార్టీ అధికార ప్రతినిధి సుధీష్‌ రాంభోట్ల, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, మాజీ డిజిపి దినేష్ రెడ్డి తదితరులు గవర్నర్ ను కలసిన వారిలో ఉన్నారు.