తెలంగాణ సెంటిమెంట్ రగల్చే ప్రయత్నంలో సోనియా

అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇప్పటి వరకు అట్లాంటి అవసరం ఎందుకు వచ్చిందో హేతుబద్దంగా చెప్పలేక పోయారు. మరోవంక గత నాలుగున్నరెళ్ళ పాలనలో అమలు చేసిన పధకాలు, ప్రజలకు చేకూర్చిన మేలును చూపి ఓట్లు అడిగే ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణ సెంటిమెంట్ ను ప్రజలలో రగల్చి మరో మారు ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. అందుకనే కేవలం 12 సీట్లకు పోటీ చేస్తున్న తెలుగు దేశం పార్టీని లక్ష్యంగా చేసుకొంటున్నారు.

తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏ కాంగ్రెస్ పార్టీని తుద ముట్టించడం కోసం మామగారైన ఎన్టి రామారావు ఆ పార్టీని ప్రారంభించారో, ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలపడం, తెలంగాణలో ఉనికిని కాపాడు కోవడం ద్వారా ఆంధ్ర ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యతిరేకత నుండి బయట పడటం కోసం విఫల ప్రయత్నం చేస్తున్నారు. అదే కెసిఆర్ కు అక్కరకు వస్తున్నది. కాంగ్రెస్ గెలిస్తే అమరావతి పాలన వస్తుందని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఎన్నో పోరాటాలు జరిపి సాధించుకున్న తెలంగాణ మట్టిపాలవుతుందనే భయాన్ని ప్రజలలో కలించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుడా కెసిఆర్ పాలనా వైఫల్యాలను ప్రజల ముందుంచి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయకుండా తెలంగాణ తెచ్చింది సోనియా గాంధీ అంటూ ప్రజలలో సెంటిమెంట్ రగిలించడం కోసం ఆమెను తీసుకు వచ్చి మేడ్చల్ లో బహిరంగ సభ జరిపారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా ఇంటికే పరిమితం అవుతున్న ఆమెను ప్రత్యేకంగా తీసుకు వచ్చి బహిరంగ సభను ఏర్పాటు చేసారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఇదు రాష్ట్రాలలో మరెక్కడికి ఆమె ప్రచారం కోసం రాక పోవడం గమనార్హం.

యుపియే ప్రభుత్వం హయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పట్టుబట్టిన నేతగా ప్రజలలో ఆమె పట్ల ఉన్న సానుకూల ధోరణిని ఓట్లుగా మార్చుకోవాలని కాంగ్రెస్ నాయకులు వ్యూహాత్మకంగా ఆమెతో బహిరంగ సభ పెట్టించారు. పైగా, తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆమె ఇంతవరకు రాష్ట్రంలో పర్యటించక పోవడం, తొలిసారిగా రావడం కూడా సానుకూల అంశంగా భావిస్తున్నారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు తమ ప్రసంగాలలో తెలంగాణా సెంటిమెంట్ నే ప్రస్తావించే ప్రయత్నం చేసారు. పైగా తల్లి, కొడుకులు ఒకే ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడం కుడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

నీలిరంగు చీరతో, నుదుటన వీరతిలకంతో అచ్చు తెలంగాణ ఆడపడుచులా స్వచ్ఛమైన హిందీ భాషలో ప్రసంగించడం ద్వారా ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేసారు. పైగా ప్రజలకు కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగం ప్రారంభించడం ద్వారా కుమారుడు రాహుల్ నుండి స్పూర్తితో  `హిందూ సెంటిమెంట్’ ప్రేరేపించే ప్రయత్నం చేసిన్నట్లు కనిపిస్తున్నది.

రాజకీయంగా నష్టం ఏర్పడినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని చెప్పడం ద్వారా ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేసారు. మరోవంక తెలంగాణకు తాను బాసటగా నిలబడటం పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలలో అసహనానికి దారితీయడాన్ని కుడా పరిగణలోకి తీసుకున్నట్లు ఉన్నారు. తెలంగాణలో సహితం సీమంధ్ర ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఎపికి ప్రత్యేక హోదా కల్పించడాన్ని ప్రస్తావించారు.

చాలాకాలం తర్వాత బిడ్డల్ని చూసిన తల్లిలా తనకు ఉందని ప్రసంగం ప్రారంభించడం, చివరిలో  జైతెలంగాణ అని ప్రసంగాన్ని ముగించడం ద్వారా తన వల్లననే తెలంగాణ వచ్చినదనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేసారు. అందుకోసం తెలంగాణ ప్రజలు జరిపిన వీరోచిత పోరాటాన్ని గాని, పోరాటంలో అమరులైన వందలాది మంది యువకులను గాని ఆమె ప్రస్తావించక పోవడం గమనార్హం.

మరోవంక మొదటిసారిగా కాంగ్రెస్ ఆధర్యంలో ఏర్పడిన ప్రజా కూటమి అగ్రనాయకులు అందరు ఒకే వేదికపై కనిపించారు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ నాయకులు సోనియా గాంధీతో వేదికను పంచుకోవడం, రాష్ట్ర టిడిపి అద్యక్షుడు ఎల్ రమణ తన రాజకీయ జీవితం కుడా కాంగ్రెస్ తో ప్రారంభమైనదని నెమరువేసుకోవడం, తన జీవితం అంతా ఎన్నికల పక్రియపై ఎటువంటి నమ్మకం చూపకుండా, అడవులలో ఆయుధాలతో పోరాటాలు చేస్తున్న నక్సలైట్ లకు మద్దతుగా గడిపిన గద్దర్ సోనియా గాంధీని శాలువాతో సత్కరించడం గమనిస్తే `రాజకీయ ఉనికి’ కాపాడు కోవడం ప్రయత్నం చేస్తున్న వారంతా ఒకే వేదికపైకి చేరిన్నట్లు స్పష్టం అవుతుంది.