పాక్ ఆర్మీ చీఫ్ తో సిద్దు హాగ్ పై రగడ

పంజాబ్ కు చెందిన మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు నవజోట్ సింగ్ సిద్ధు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారంకు వెళ్ళడమే కాకుండా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఊమర్ జావేద్ బజ్వాను కౌగలించుకోవడం పెను దుమారం రేపింది. పంజాబ్ లోని ప్రతిపక్షాలు ఒకవంక తూర్పార పడుతుండగా, సోషల్ మీడియాలో నెటిజన్లు చాలామంది దుమ్మెత్తి పోస్తున్నారు. నిత్యం సరిహద్దుల్లో మన సైనికులను, అమాయక ప్రజలను చంపుతున్న సైన్యాధిపతిని కౌగలించుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాను ఈ కౌగిలింత ద్వారా `ప్రేమ సందేశం’ తీసుకు వచ్చానని సిద్దు చెప్పినా తమాయించుకో లేక పోతున్నారు. “నేను భారత్ నుండి ప్రేమను (పాకిస్తాన్ కు) తీసుకు వచ్చాను. తిరిగి వందరెట్లు ఎక్కువ ప్రేమతో వెడుతున్నాను” అంటూ చేసిన వాఖ్యాలను ఎద్దేవా చేస్తున్నారు.

పాకిస్తాన్ కు సిద్దు పర్యటనను “సిగ్గుచేటు” అని పంజాబ్ బిజెపి అద్యక్షుడు శవిత్ మాలిక్ విమర్శించారు. ఒకవంక భారత దేశం మాజీ ప్రధాని వాజపేయి మృతితో సంతాప దినాలు పాటిస్తూ ఉంటె ఇటువంటి సమయంలో పాకిస్తాన్ వెళ్ళడం అవసరమా అని ప్రశ్నించారు. సరిహద్దుల్లో భారత సైనికులు చేస్తున్న త్యాగాలు ఆ సమయంలో సిగ్గుకు గుర్తుకు వచ్చాయా అని నిలదీశారు.

ఇటువంటి ఆమోదయోగ్యం కాని చర్యకు పాల్పడినందుకు సిద్దు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. సిద్దు అవకాశవాద రాజకీయ వేత్త అని పేర్కొంటూ భారత జాతి గౌరవాన్ని ప్రమాదంలోకి నేట్టివేస్తున్నారని దయ్యబట్టారు.

పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళడం ద్వారా సిద్దు అన్ని మర్యాదలను మంటగరిపారని శిరోమణి అకాలీదళ్ విమర్శించింది. మొత్తం జాతి మాజీ ప్రధాని వాజపాయి మృతిచెందడంతో వారం రోజులపాటు సంతాప దినాలుగా పాటిస్తూ ఉన్న సమయంలో ఏ మంత్రి కూడా అధికారిక కార్యక్రమాలను హాజరు కాకూడదని గుర్తు చేసారు. కాని పంజాబ్ మంత్రిగా ఉంటూ పాకిస్తాన్ కు వెళ్ళడం ద్వారా ఈ మర్యాదను అధిగమించారని అకాలీదళ్ అధికార ప్రతినిధి దాల్జిత్ సింగ్ చీమ ద్వజమెత్తారు.