కేసీఆర్‌కే మళ్లీ పట్టం.. టైమ్స్‌నౌ సర్వే వెల్లడి

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌కే పట్టం కట్టనున్నారు. టీఆర్‌ఎస్ 70 సీట్లను గెలుచుకోనున్నట్టు టైమ్స్‌నౌ ప్రీ పోల్స్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ 31 సీట్లను, టీడీపీ 2, ఎమ్‌ఐఎమ్ 8, బీజేపీ 3, ఇతరులు 5 సీట్లు గెలుచుకోనున్నట్లు సర్వే ప్రకటించింది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలని 45.27 శాతం ప్రజలు కోరుకోగా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి 30.55, కోదండరాంకు 3.37 శాతం మద్దతు లభించింది. ఇక టీఆర్‌ఎస్‌కు 37.55 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 27.98 శాతం, టీడీపీకి 5.66, ఎమ్‌ఐఎమ్‌కు 4.10 శాతం, బీజేపీకి 11 శాతం, ఇతరులకు 13.71 శాతమని సర్వే వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్‌ఎస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించిందని 45.73 శాతం ప్రజలు తెలుపగా, కాంగ్రెస్ వైపు 32.90 శాతం ప్రజలు ఉన్నారని సర్వే వెల్లడించింది. తెలంగాణ వ్యతిరేక పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను హర్ట్ చేసిందని 52.44 శాతం ప్రజలు తెలిపినట్లు సర్వే ప్రకటించింది.

ఈ సర్వేను బట్టి రాహుల్ గాంధీ, చంద్రబాబు పొత్తును తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. 2014 లో టీఆర్‌ఎస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 34.30 కాగా ఈసారి 37.55 శాతం రానున్నట్టు సర్వే తెలిపింది. అంటే 3.25 శాతం ఓట్ల శాతం టీఆర్‌ఎస్‌కు పెరిగింది.

టీడీపీకి 2014 లో 14.70 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 5.66 శాతం ఓట్లే వచ్చాయి. అంటే టీడీపీ ఓట్ల శాతం 9.04 శాతం తగ్గుతోంది. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు టీడీపీని ఎప్పుడో తిరస్కరించారని అర్థం అవుతోంది. తెలంగాణలో టీడీపీ ఇక కనుమరుగైనట్టే.