తెలంగాణలో ‘చంద్ర’గ్రహణం.. బిజెపి నేత హెచ్చరిక

తెలంగాణలో చంద్ర గ్రహణం రాకూడదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు హెచ్చరించారు. ఫలితాలను చంద్రబాబు నిర్దేశించాలనుకుంటారని అంటూ తెలంగాణలో ఆయన నిర్దేశించే రాజకీయాలు రావని, రాకూడదని స్పష్టం చేసారు. చంద్రబాబు ముక్త్‌ తెలంగాణ కావాలి, చంద్రబాబు లేని రాజకీయాలు మాత్రమే ఉండాలి అని పిలుపిచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యతిరేకులకు కోవర్టుగా మారిందని తీవ్రంగా ఆరోపించారు. టీడీపీ తెలంగాణ ధోఖా పార్టీ అంటూ అభివర్ణించారు. తెలంగాణ అభివృద్దికి, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలపై చర్చలు జరగాలని, వాటిపై కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ప్రజలను ఒంటిరిగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్‌ మహా కూటమి తయారు చేసిందని ద్వజమెత్తారు. కాంగ్రెస్‌ నేతలను బెంగళూరు, ఢిల్లీలో కలిసిన చంద్రబాబు  తెలంగాణలో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో వారితో ఎందుకు పాల్గొనడం లేదని మురళీధరరావు నిలదీశారు.

నరేంద్ర మోదీ సర్కార్‌ తెలంగాణకు ఇచ్చిన నిధులను ప్రజలకు వివరిస్తామని చెబుతూ తెలంగాణలో మోదీ, అమిత్‌ షా విస్తృతంగా పర్యటన చేస్తారని తెలిపారు. జాతీయ ముఖ్య నేతలతో వందకు పైగా సభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దక్షిణాది విస్తరణకు, 2019 లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే బీజేపీకి నాంది అని  మురళీధర్‌ రావు భరోసా వ్యక్తం చేసారు.

కాగా, మత ఆధారిత రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పటికీ వ్యతిరేకమే అని స్పష్టం చేసారు. నిజాం గులాంగిరిని, ఖాసీం రజ్వీ రాజకీయాలను బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వలేకే ముస్లింలతో ముడిపెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో జరిగే ఎన్నికలు కుటంబ రాజకీయాలకు, జాతీయవాద రాజకీయాలకు మధ్య జరిగే పోరాటంగా అభివర్ణించారు.

రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ నాయకులు భారత్‌ మాతాకు జై అనొద్దు, సోనియా గాంధీకి జై అనాలన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయని గుర్తు చేసారు. దీంతో అర్థమవుతోంది దేశమంటే కాంగ్రెస్‌కు ఎంత అభిమానమో’ అంటూ మురళీధర్‌ రావు అని ఎద్దేవా చేసారు.