కేంద్రంలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ బడ్జెట్ మాత్రమె

సంప్రదాయాన్ని పక్కనబెట్టి ఎన్నికల ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థికశాఖ తోసిపుచ్చింది. ప్రతి సార్వత్రిక ఎన్నికల ముందు మాదిరిగానే వచ్చే ఏడాది ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ బడ్జెట్‌నే ప్రవేశపెడతారని ఆ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

‘వచ్చే ఏడాది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెటే. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. అరుణ్‌జైట్లీ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్‌ రోజులపై దృష్టిపెడతారు. కొత్తగా ఏ పథకాలను ప్రకటించరు. పన్ను రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు’ అని సదరు అధికారి వెల్లడించారు.

2019 ఫిబ్రవరి 1న జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ కాకుండా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు గురువారం వార్తలు వచ్చాయి. ఈ ప్రయత్నంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తామే విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని బిజెపి ప్రకటించాలనుకుంటున్నట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారు. అయితే ఇవి కేవలం వదంతులు మాత్రమేనని తాజాగా ఆర్థికశాఖ స్పష్టం చేసింది.

గతేడాది బడ్జెట్‌ సమావేశం తేదీని కేంద్ర ప్రభుత్వం మార్చిన విషయం తెలిసిందే. అంతకుముందు ఫిబ్రవరి నెలలో చివరి పనిదినం నాడు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. అయితే ఈ సంప్రదాయాన్ని పక్కనబెడుతూ 2017 నుంచి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1నే ప్రవేశపెడుతున్నారు. ఇక అంతకుముందు ప్రత్యేకంగా ప్రకటించే రైల్వే బడ్జెట్‌ను కూడా కేంద్ర బడ్జెట్‌తో కలిపే ప్రవేశపెడుతున్నారు.

కాగా.. సార్వత్రిక ఎన్నికల ముందు మాత్రం ఇలా పూర్తిస్థాయి బడ్జెట్‌ కాకుండా.. నాలుగు నెలల కోసం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రకటిస్తారు. ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వం మిగతా ఎనిమిది నెలలకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.