కేరళ బాధితుల అండగా తెలంగాణ ప్రభుత్వం

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళ ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేయూత ఇస్తున్నది. వరద భాదితుల సహాయార్థం తొలుత రూ.25కోట్ల సహాయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు. తాజాగా  అక్కడి చిన్నారుల ఆకలిబాధలు తీర్చేందుకు రూ.52.5 లక్షల విలువ చేసే వంద మెట్రిక్‌ టన్నుల బాలామృతం ఆహారాన్ని కేరళకు తరలించనుంది.

 

బాలామృతం పథకం కింద నాచారంలోని తెలంగాణ ఫుడ్స్‌లో సిద్ధం చేసిన 100 మెట్రిక్ టన్నుల పౌష్టికాహారాన్ని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక విమానంలో కేరళకు తరలిస్తున్నారు. సైనిక విమానం వద్దకు వెళ్లే బాలామృతం వాహనాలను తెలంగాణ ఫుడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయేంద్ర బోయే, ఛైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.

 

కెరళ వరద బాధితుల సహాయార్థం బాలామృతం పౌష్టికాహారాన్ని ముఖ్యమంత్రి ఆదేశానుసారం పంపిస్తున్నామని విజయేంద్రబోయే తెలిపారు. ఏడు నెలల పిల్లల నుంచి మూడేళ్ల వయస్సున్న పిల్లలకు ఈ సమయంలో పౌష్టికాహారంగా బాలామృతం ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు.

 

మరోవంక విజయ్ డెయిరీ నుంచి రూ.40లక్షల విలువైన 20 టన్నుల పాలపొడి పంపేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 20 టన్నుల పాలపొడి కేరళకు పంపనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ తరఫున కేరళకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని  కేసీఆర్ ప్రకటించారు.