తిరగేసిన లిల్లీ ఆకృతిలో ఎపి అసెంబ్లీ డిజైన్

మరో ఆరు నెలలో ఎన్నికలు వస్తున్నా సమయంలో ఇంతకాలం ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరం నిర్మిస్తాను అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్నికల నాటికి కనీసం పునాదులైన లేవని పక్షంలో ప్రజలు నమ్మరని ఆందోళన చెందుతున్నారు. దానితో ఇప్పటి వరకు డిజైన్ లను సహితం ఖరారు చేయని ఆయన ఇప్పుడు హడావుడిగా ఆ పనుల పట్ల దృష్టి సారిస్తున్నారు. ఈ నెలాఖరులోగా నూతన అసెంబ్లీ భవనం డిజైన్‌ను ఆమోదించి, నిర్మాణానికి టెండర్లు కూడా పిలవాలని ఆదేశాలు జారీచేసారు.

250 మీటర్ల ఎత్తులో తిరగేసిన లిల్లీ ఫ్లవర్ ఆకృతిలో ఐకానిక్ అసెంబ్లీ భవనం నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లు ఇప్పుడు చెబుతున్నారు. సీఎం చంద్రబాబునాయుడుకు లండన్ నుంచి వచ్చిన నార్మన్ ఫోస్టర్స్ బృంద సభ్యులు తిరగేసిన లిల్లీ ఫ్లవర్ ఆకృతిలో ఐకానిక్ టవర్ అసెంబ్లీ భవనం డిజైన్‌ను సీఎం చంద్రబాబుకు చూపించారు. డిజైన్ పరిశీలించిన సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు చేసి  తుది డిజైన్‌ను రూపొందించి తీసుకురావాలని కోరారు. వచ్చే సమావేశంలో డిజైన్లను ఖరారు చేసి, ఈ నెల 30వ తేదీ నాటికి ఐకానిక్ టవర్ అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లు పిలవాలని భావిస్తున్నారు.

నూతన అసెంబ్లీ భవనం టవర్‌లో రెండు గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు. 80 మీటర్ల ఎత్తులో ఏర్పాటుచేసే మొదటి గ్యాలరీలో 300 మంది, 250 మీటర్ల ఎత్తులో మరో గ్యాలరీలో 25 మంది నగరాన్ని వీక్షించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన అసెంబ్లీ భవనం పొడవు 200 మీటర్లు ఉంటుంది. మూడు అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మాణం చేపట్టనున్నారు. అమరావతి అందాలు వీక్షించేలా గ్యాలరీల చుట్టూ అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్యాలరీల్లోకి వెళ్లడానికి లిఫ్ట్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. తుపాన్లు, భూకంపాలు తట్టుకునేలా డిజైన్లు రూపొందిస్తున్నారు.

కాగా, పరిపాలన నగరంలో నిర్మించే ప్రభుత్వ భవంతులను కేవలం అధికార యంత్రాంగానికే పరిమితం చేయకుండా సాధారణ ప్రజలు కూడా సందర్శించేందుకు వీలుగా ఉండాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఐదు టవర్లకు కుడి పక్కన ఉన్న ప్రదేశాన్ని పూర్తిగా పబ్లిక్ ప్లేస్‌గా ఉంచాలని సూచించారు. దాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించాలని, రాజధాని వాసులకు, నగర సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించే వినోద, విహార ప్రదేశంగా తీర్చిదిద్దాలని చెప్పారు.

అక్కడే మల్టీఫ్లెక్స్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ సెంటర్, ఫుడ్ కోర్టులు, ఉద్యానాలు, షాపింగ్ సెంటర్లు ఉండేలా చూడాలన్నారు. సచివాలయానికి పనులకోసం వచ్చే సందర్శకులనే కాకుండా సాధారణ ప్రజలను కూడా అనుమతిస్తేనే ప్రజారాజధాని అనే పేరుకు సార్ధకత ఉంటుందని అభిప్రాయపడ్డారు. పరిపాలన నగరం మొత్తం మీద ఫేస్ డిటెక్షన్ సహా అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు ఉంటున్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తబోవని చెప్పారు. 

శాసనసభ భవంతిలో అంతర్భాగంగా నిర్మిస్తున్న పార్లమెంట్ తరహా సెంట్రల్‌హాలు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించేలా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.