పరాభవంతో మంత్రిపదవికై ఎదురు చూస్తున్న కోదండరాం !

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కూడిన జెఎసికి సారధ్యం వహించే అవకాశం కలిగిన ప్రొఫెసర్ ఏం కోదండరామ్ తెలంగాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తన ఉనికిని గుర్హించాకుండా, నిర్లక్షం చేయడంతో తమాయించుకోలేక పోయారు. ఎన్నికల ముందు తెలంగాణ ప్రజా సమితి పేరుతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, మొత్తం అన్ని సీట్లకు పోటీ చేయడం ద్వారా ప్రబలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని, ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక వహిస్తూ ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకోవాలని ఆశ పడ్డారు.

అయితే క్షేత్ర స్థాయిలో బలం సమకుర్చుకోలేక పోవడంతో కాంగ్రెస్ తో పొత్తుకు సిద్దపడి, మొదట్లో లోక్ సభ నియోజకవర్గానికి రెండు సీట్లు చొప్పున కనీసం 34 సీట్లలో పోటీ అంటూ బేరాలు ప్రారంభించి, చివరకు 12 సీట్ల వద్ద మొండి పట్టు పడుతూ వచ్చారు. అయితే ఆ పార్టీకి ఎన్నికలలో అభ్యర్ధులను నిలబెట్టి, గెలిపించుకొనే బలం లేదని, వారికి సీట్లు ఇవ్వడం అంటే ఓటమికి ఇప్పుకోవటమే అని భావిస్తూ వచ్చిన కాంగ్రెస్ మొదట్లో మూడు, నాలుగు సీట్లు అంటూ ప్రారంభించి చివరకు 8 సీట్లు ఇవ్వడానికో ఒప్పుకొంది.

నామినేషన్ల ఘట్టం పూర్తయ్యే సరికి ప్రజా కూటమి పొత్తులో సొంతంగా 4 స్థానాల్లో పోటీకే పరిమితం కావలసి వచ్చింది. మరో 4 స్థానాల్లో టీజేఎస్‌ పోటీ చేస్తున్నా, అక్కడ `స్నేహపూర్వక పోటీ’ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. కోదండరాం ఈ విషయమై కాంగ్రెస్ అగ్ర నాయకులపై వత్తిడి తీసుకు రావడానికి ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.

టీజేఎస్‌కు 8 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్‌ మొదట్లో చెప్పినప్పటికీ 6 స్థానాలపైనే స్పష్టత ఇచ్చింది. మరో 2 స్థానాలను నామినేషన్ల చివరిరోజు వరకూ దాటవేస్తూ వచ్చింది. కాంగ్రెస్‌ వైఖరిని గ్రహించిన టీజేఎస్‌ 14 స్థానాల్లో అభ్యర్థులకు బీ– ఫారాలు ఇచ్చి నామినేషన్లు వేయించింది.

గురువారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఉదయం నుంచి కాంగ్రెస్‌ నేతలతో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పలుమార్లు భేటీ అయ్యారు. తమకు ఇస్తామన్న 8 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ లేకుండా చూడాలని కోరారు. తొలుత కేటాయించిన మల్కాజిగిరి, వర్ధన్నపేట, సిద్దిపేట స్థానాలు గాక అంబర్‌పేట్‌లో కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని పోటీ నుంచి విరమింపజేయించి టీజేఎస్‌కు ఇచ్చింది. వరంగల్‌ ఈస్ట్, దుబ్బాక, ఆసిఫాబాద్, ఖానాపూర్‌ స్థానాలను కూడా ఇవ్వాలని కోదండరాం కోరినా కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయలేదు.

దీంతో ఈ 4 చోట్ల స్నేహపూర్వక పోటీ తప్పలేదు. టీజేఎస్‌ నామినేషన్లు వేసిన 14 స్థానాల్లో 8 స్థానాలపై స్పష్టత వచ్చింది. ఇక స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి నామినేషన్‌ వేసిన టీజేఎస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురయింది. దీంతో ఈ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థే పోటీలో ఉన్నారు. ఇక, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్, చెన్నూ రు, అశ్వరావుపేట్, మెదక్‌ స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి టీజేఎస్‌ ప్రతిపాదించినా కాం గ్రెస్‌ ససేమిరా అనడంతో టీజేఎస్‌ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

ప్రస్తుతం టీజేఎస్‌ పోటీ చేస్తున్న స్థానాలలో ఒక్క చోట కుడా పోటీ చేసే అవకాశం కనబడటం లేదు. దానితో ఆ పార్టీలో తీవ్రమైన అసహనం, అసమ్మతి వ్యక్తం అవుతున్నది. కోదండరామ్ ఎంతసేపటికి తన హోదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అందులో తనకు కీలక పదవి కట్టబెట్టడం వంటి అంశాలపై దృష్టి సారించారు తప్ప బలమైన రాజకీయ శక్తిగా పార్టీని పటిష్ట పరచడం పట్ల ద్రుష్టి సారించాలేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. దానితో ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చూడాలి అనుకున్న మద్దతు దారులే ఇప్పుడు ఎవగించుకొనే పరిస్థితి ఏర్పడింది.

చివరికి సొంతంగా పోటీ చేసే సాహసం చేయలేని స్థితిలో ఆయన ఉండటం ఆయన మద్దతు దారులలో తీవ్ర ఆశాభంగం కలుగుతున్నది. కూటమి కోసం తమ పార్టీని ఫణంగా పెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  టీజేఎస్‌ అడ్వొకేట్‌ విభాగం నేతలు పార్టీ కార్యాలయంలోనే ఈ విషయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పొత్తు పేరుతో కాంగ్రెస్‌. తమ పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేసిందని వాపోతున్నారు.

తెలంగాణ ఉద్యమంలో సహితం అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను సమన్వయం చేసే బాధ్యత అప్పజెబితే ఒకొక్క పార్టీని బయటకు నెట్టి వేయడం ద్వారా దానిని టి ఆర్ ఎస్ అనుబంధ సంస్థగా మార్చారని, అందుకు ప్రభుత్వం ఏర్పాటులో కెసిఆర్ తగు రీతిలో `ప్రతిఫలం’ అందిస్తారని ఎదురు చూస్తే చిత్కారం ఎదుర్కోవలసి వచ్చినదని పరిశీలకులు చెబుతున్నారు. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అదేవిధమైన పరిస్థితి ఉండక తప్పదని పలువురు భావితున్నారు.