శ్రీనగర్‌లో ఆరుగురు ఉగ్రవాదుల హతం

 జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతూనే ఉంది. తాజాగా అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. శుక్రవారం తెల్లవారు జామున జమ్ము కశ్మీర్‌ పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా బిజ్‌భేరా పట్టణంలోని సెకిపోరా ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి.

ఈ నేపథ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురిని హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా ఈ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతుంది. మృతి చెందిన ఉగ్రవాదుల వద్ద నుంచి భారీగా ఆయుధాలతో పాటు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిని ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా అధికారులు పేర్కొంటున్నారు.

గత కొన్ని నెలలుగా జమ్ములో ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా ఉండడంతో భద్రతా దళా లు నిర్బంధ తనిఖీలు చేపట్టి ఉగ్రవాదులను ఏరివేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం షోపియన్‌ జిల్లా నదిగామ్‌ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు నలుగురు ముష్కరులను హతమార్చాయి. ఈ ఘటనలో ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయాడు.