రెండు కోట్ల గృహాలకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా

దేశంలో గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. త్వరలో సిటీగ్యాస్ నెట్‌వర్క్‌ను 400 జిల్లాలకు విస్తరిస్తామని, రెండు కోట్ల ఇండ్లకు పైపుల ద్వారా వంటగ్యాస్‌ను అందిస్తామని, పదివేల సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

18 రాష్ర్టాల్లోని 129 జిల్లాల్లో సిటీగ్యాస్ నెట్‌వర్క్‌కు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఎన్నికల కోడ్ వల్ల తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలను మినహాయించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 2030 నాటికి విద్యుత్ రంగంలో పర్యావరణ అనుకూల ఇంధనం వాటాను 6.2% నుంచి 15 శాతానికి పెంచుతామని తెలిపారు. దీంతో దేశంలో లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, అదే సమయంలో ఉద్గారాల తీవ్రతను 33-35 శాతానికి తగ్గిస్తామన్న మన హామీ నెరవేరుతుందని స్పష్టం చేసారు.

గ్యాస్ పైప్‌లైన్ల నిర్వహణ, ధరల నిర్ధారణలో పారదర్శకత కోసం స్వతంత్ర రవాణా ఆపరేటర్‌ను, ఓ వాణిజ్య ఎక్సేంజ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మోదీ కొత్తగా మరో 124 జిల్లాల్లో సిటీ గ్యాస్ లైసెన్సుల కోసం 10వ రౌండ్ టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించారు. గత నాలుగేండ్లలో పైపుల ద్వారా వంట గదివరకు గ్యాస్ అందించే కనెక్షన్ల సంఖ్య 50 లక్షలకు చేరిందని, దీనిని రెండు కోట్లకు పెంచుతామని తెలిపారు.

అలాగే సీఎన్జీ స్టేషన్ల సంఖ్య 947 నుంచి 1,470కి చేరిందని, మరో పదేండ్లలో వీటి సంఖ్యను 10వేలకు పెంచుతామని ప్రధాని చెప్పారు. మరో దశాబ్దిలో సహజవాయువు వినియోగం రెండున్నర రెట్లు పెరుగవచ్చన్నారు. స్వచ్ఛ ఇంధన ప్రోత్సాహానికి వచ్చే ఐదేండ్లలో ఐదువేల బయోగ్యాస్ ప్లాంట్లను నెలకొల్పుతామని తెలిపారు.

వాహనాలకు సీఎన్‌జి, ప్రజలకు ఇంటికే వంటగ్యాస్‌ను పైపుల ద్వారా సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ద్వారా 18 రాష్ట్రాల్లోని 129 జిల్లాలకు అనగా ఇంచుమించు దేశంలోని నాలుగోవంతు ప్రజలకు వంటగదికే నేరుగా గ్యాస్ సరఫరా అవుతుంది. పర్యావరణ కాలుష్యం లేకుండా పర్యావరణ హితంగా పనిచేసే సహజవాయువును వాహనాలకు, వంటగ్యాస్‌గా ఉపయోగించేందుకు ఉద్దేశించిన ఈ పథకం పదోవిడత బిడ్డింగ్‌ను మోదీ ప్రారంభించారు.

ఈ పదోవిడత పనులు కనుక పూర్తయితే సహజవాయువును ఇంధనంగా దేశంలోని 400 జిల్లాలకు అందజేయవచ్చునని, దీని ద్వారా 70 శాతం ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని చెప్పారు. అలాగే సీఎన్‌జీ స్టేషన్ల సంఖ్యను ప్రస్తుతమున్న దానికి రెట్టింపు చేస్తూ పదివేలకు పెంచుతామని, పెట్రోలియం, అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు కొన్నివారాల క్రితం తొమ్మిదో విడత బిడ్డింగ్‌లో 78 లైసెన్స్‌లు ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న రాష్ట్రాలు మినహా 65 ప్రాంతాల్లో దీనికి శంకుస్థాపన జరిగిందని చెప్పారు.

ఈ సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాజధాని ఢిల్లీలో ఉన్న విజ్ఞానభవన్ నుంచి ఆయన లైసెన్స్‌లు పొందిన వారితో మాట్లాడుతూ పనులకు శంకుస్థాపన చేశారు. ఏడాదికి 142 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు ఉత్పత్తి అయ్యే సహజవాయువులో భారత్‌లో ఎనర్జీ అవసరాలకు వినియోగించేది 6.2 శాతం మాత్రమేనని, అదే ప్రపంచ దేశాల్లో ఇది 24 శాతం సగటని అన్నారు. కాగా ఉత్పత్తవుతున్న సహజవాయువులో 25 శాతం గుజరాత్ నుంచి వస్తోందని వివరించారు.

కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ లాంటి ద్రవ ఇంధనాల కన్నా లిక్విడ్ ఇంధనమైన గ్యాస్ చవకైనదే కాక పర్యావరణ హితమైనదని చెప్పారు. ఇంటింటికీ పైపులైన్‌ల ద్వారా గ్యాస్‌ను సరఫరా చేసేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు.

ప్రస్తుతం 4.6 మిలియన్ ఇళ్లకు పైపులైన్ కనెక్షన్లు ఉన్నాయని, తాము చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా వీటిని రెండు కోట్లకు చేరుస్తామని వెల్లడించారు. 9, 10 రౌండ్ల ద్వారా తాము చేపట్టిన పనుల ద్వారా భారత్‌లోని 42 శాతాన్ని కవర్ చేస్తామని చెప్పారు. పదో విడతలో చేపట్టే పనుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నగరం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.