టీడీపీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ పై విచారణ !

పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలోగల సున్నం మిల్లుల యజమానుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అలాగే క్వారీలను పరిశీలించి పోలీస్ స్టేషన్ లో ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు.

ఈ విషయమై గతనెల రాష్ట్ర హై కోర్ట్ తీవ్రంగా స్పందించడంతో ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు స్తంభించి పోయాయి. ప్రభుత్వం సిబిసిఐడి విచారణకు ఆదేసించి, ఈ అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

గురజాల టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌రావు సారధ్యంలోనే ఈ అక్రమ మైనింగ్ వ్యవహారాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై సిబిఐ విచారణ జరిపించాలని వైసిపి నేతలు ఆందోళనలు చేస్తున్నారు. వీటివల్లన ప్రభుత్వం రూ 4,000 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతున్నట్లు  ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

దీనిలో భాగంగా సిఐడి,  మైనింగ్‌ అధికారులు పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.18 ఏళ్ల మైనింగ్‌ లావాదేవీలపై సిఐడి విచారణ జరుపుతోంది. అంతకుముందు అక్రమ మైనింగ్‌ జరిగిన పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తోన్న అధికారులకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

ఈ అక్రమ మైనింగ్ పై మాజీ ఎమ్యేల్సి టివిజి కృష్ణారెడ్డి లోకాయుక్త, హై కోర్ట్, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ లకు ఫిర్యాదులు చేయడంతో ప్రభుత్వంలో కదలిక కనిపిస్తున్నది. ఎమ్యెల్యే యరపతినేని సారధ్యంలోనే అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు లోకాయుక్త విచారణాధికారి నివేదిక ఇవ్వడంతో సంచలనం కలిగించింది.

కాగా, గురజాల అక్రమ మైనింగ్‌ కేసులో టీడీపీ ఎమ్మెల్యే యరపతి శ్రీనివాస రావుకు క్లీన​చీట్‌ ఇవ్వటానికే సీఐడీ విచారణను జరుపుతున్నారని వైఎస్సార్‌ సీపీ సమన్వయ కర్త కాసు మహేష్‌ రెడ్డి ఆరోపించారు. సీబిఐతో జరపాల్సిన విచారణను సీఐడీతో జరిపించాల్సిన అవసరమేంటని నిలదీశారు. ఐదు వందల కోట్లు దోచిన స్కాంను సీబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.