మెహబూబ్, ఒమర్ లకు సరిహద్దు అవతల నుండి ఆదేశాలు : రామ్ మాధవ్

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీసుకున్న చర్యను గట్టిగా సమర్ధిస్తూ సరిహద్దు అవతలి నుండి వచ్చిన `ఆదేశాల’ కారణంగానే ఇప్పటి వరకు పరస్పరం వ్యతిరేకించుకొంటు వస్తున్న పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అంటూ కలసి వచ్చారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తీవ్రమైన ఆరోపణ చేసారు.

సరిహద్దు అవతలి నుండి వచ్చిన ఆదేశాల కారణంగానే గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను ఈ రెండు పార్టీలు కలసి బహిష్కరించాయని ఆయన గుర్తు చేసారు. బహుషా  ఇప్పుడు తాజాగా అటువంటి ఆదేశాలు రావడంతోనే వారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చి ఉండవచ్చని పేర్కొన్నారు. అందుకనే మొత్తం సమస్యను గవర్నర్ గాజాగా పరిగణలోకి తీసుకోవలసి వచ్చినదని తెలిపారు.

ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్దతను వ్యక్తం చేస్తూ పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ లేఖ పంపడానికి రాజ్ భవన్ లో ఫాక్స్ మిషన్ పనిచేయక పోవడం గురించి గవర్నర్ మాత్రమె జవాబు ఇవ్వాలని రామ్ మాధవ్ చెప్పారు. అయితే అది కేవలం ఆమెకు కుంటి సాకు మాత్రమె అని స్పష్టం చేసారు.

ఆమె తన లేఖలో తాను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఎక్కడా పెర్కొనలేదని ఆయన గుర్తు చేసారు. కేవలం `నేను వచ్చి మిమ్ములను కలుస్తాను. ప్రభుత్వం ఏర్పాటు చేయడం గురించి తెలుపుతాను’ అని మాత్రమె ఉన్నదని చెప్పారు. ఇదంతా ఒక డ్రామా అని రామ్ మాధవ్ కొట్టిపారవేసారు.

ఇలా ఉండగా, అసెంబ్లీ రద్దు కావడంతో రెండేళ్లకు ముందే రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరపడానికి అవకాశం కల్పిస్తున్నది. దానితో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిపి అవకాశం కనిపిస్తున్నది. గవర్నర్ పాలనకు ఉన్న ఆరు నెలల గడువు డిసెంబర్ 18తో ముగుస్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించ వలసి వస్తుంది. పిడిపి-బిజెపి ప్రభుత్వం కూలి పోవడంతో జూన్ 19న రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించడం జరిగింది.