అసెంబ్లీ రద్దుకు నాలుగు కారణాలు చెప్పిన గవర్నర్ సత్యపాల్ మాలిక్

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని రద్దు చేయడానికి గవర్నర్ సత్యపాల్ మాలిక్ నాలుగు ప్రధాన కారణాలను తెలిపారు. మితిమీరి పార్టీలు మారడం, అందుకోసం డబ్బు చేతులు మారుతూ ఉండటం, పరస్పరం వ్యతిరేక రాజకీయ సిద్దంతాలు ఉన్న రాజకీయ పార్టీలు సుస్థిర ప్రభుత్వం ఏర్పరచడం అసాధ్యం కావడం, అటువంటి ప్రభుత్వం ఎంత కాలం మనుగడ సాగిస్తుందో సందేహం కావడం, రాష్ట్రంలో నెలకొన్న శాంతి బద్రతల పరిస్థితుల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు రాజ్ భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసిన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ గత ఇదు నెలలుగా అసెంబ్లీ రద్దు కోరడాన్ని ప్రస్తావిస్తూ అసెంబ్లీ రద్దు కోరుతున్న పార్టీలతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంతో సుస్థిర ప్రభుత్వం ఏర్పర్చడం అసాధ్యం అనే భావనను గవర్నర్ వ్యక్తం చేసారు. స్పస్తమైన ప్రజా తీర్పు లేని సందర్భాలలో భావసారూప్యం గల పార్టీలతో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదని గత కొద్ది సంవత్సరాల అనుభవం తెలుపుతున్నదని అంటూ పరోక్షంగా పిడిపి-బిజెపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు.

అటువంటి పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటుకు రావడం బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కన్నా అధికారం పొందటమే లక్ష్యంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం విభిన్న రాజకీయ సిద్దాంతాలు ఉన్న పార్టీలకు చెందిన శాసన సభ్యులు విస్తృతంగా పార్టీలు మారడం, డబ్బులు చేతులు మారటం వంటి కధనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అటువంటి కార్యకలాపాలు ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదని, రాజకీయ పక్రియకు సబబు కాదని గవర్నర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

తమకే శాసన సభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నదని పోటీ పడుతూ ఇద్దరు పేర్కొంటూ ఉండడంతో అటువంటి ఏర్పాటు ఎంతకాలం మనుగడ సాగిస్తుందనే తీవ్రమైన అనుమానాలు వ్యక్తం కావడం మరో కారణం. జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న ఆందోళనకరమైన శాంతి బాధ్రతల పరిస్థితుల దృష్ట్యా తీవ్ర వాదులకు వ్యతిరేకంగా విస్తృతంగా పోరాడుతూ, బద్రత పరిస్థితులపై అదుపు సాధించడం మొదలు పెట్టిన బద్రతా దళాలకు మద్దతుగా ఉండే వాతావరణం, సుస్థిరత కల్పించగల ప్రభుత్వం అవసరం అనే భావనను గవర్నర్ వ్యక్తం చేసారు.

ఇటువంటి పూర్వ రంగంలో రాష్ట్రానికి సుస్థిరత, బద్రత కల్పించడం కోసం, తగిన సమయంలో ఎన్నికలు జరిపి స్పష్టమైన ప్రజా తీర్పుతో ప్రభుత్వం ఏర్పాటుకు వీలు కల్పించడం కోసం అసెంబ్లీ రద్దు జరపడమే అత్యుత్తమమని తాను సంతృప్తి చెండుతున్నట్లు గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పష్టం చేసారు.