వివాదంలో చిక్కుకున్న కమల్‌నాథ్‌

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అద్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కమల్‌నాథ్‌ ఇబ్బందుల్లో పడ్డారు. ముస్లింలు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని పక్షంలో కాంగ్రెస్ మట్టికరుస్తుందని కమల్‌నాథ్ వీడియో సందేశంలో పేర్కొన్నట్లుగా వైరల్ అవుతున్న దృశ్యాలు వివాదస్పదమవుతున్నాయి. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ వీడియా సందేశం చూస్తే కాంగ్రెస్ పార్టీ మతరాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని బీజేపీ ఆరోపించింది.

ఈసారి మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో 90 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు పడేలా చేయాలని ఆ పార్టీ ముస్లిం నేతలను ఆ వీడియోలో కమల్‌నాథ్‌ కోరుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో గత నెలలో రికార్డు చేసినట్లు భావిస్తున్న ఈ వీడియోలో ‘నరేంద్ర మోదీకి ఓటు వేయడమంటే హిందువులకు ఓటేయడమేనని బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రజలకు సందేశాన్ని పంపుతున్నాయి. నిజంగా ముస్లింలకు ఓటేయాలని మీకు ఉంటే కాంగ్రెస్‌కు ఓటేయండి” అంటూ పిలుపిచ్చారు. పైగా, “వాళ్లు మిమ్మల్ని రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు. కానీ పోలింగ్‌ అయ్యేంతవరకూ ఓపిక పట్టండి” అంటూ సూచించారు.

గత ఎన్నికల సందర్భంగా నమోదైన ఓటింగ్‌ సరళిని ఓసారి గమనించాలని వారిని కోరుతూ ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కేవలం 50–60 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైందని చెప్పారు. 90% పోలింగ్‌ ఎందుకు జరగలేదు? అంటూ ప్రశ్నించారు.  ఒకవేళ ముస్లింలు ఈ ఎన్నికల్లో 90 శాతం ఓటు హక్కును వినియోగించుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని ఆందోళన వ్యక్తం చేసారు.

ఈ వీడియోను బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్వీట్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలను రెచ్చగొడుతోందని చెప్పేందుకు ఇంత కంటే నిదర్శనం ఏమి కావాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శోభా ఓజా స్పందిస్తూ, బీజేపీ ఎన్నికల్లో ఓటమి భయంతో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు బీజేపీ సమాధానం ఇవ్వలేకపోతోందని ద్వజమెత్తారు.

వివిధ మతాల వాళ్లు కమల్‌నాథ్‌ను కలుస్తున్నారని చెబుతూ ఓటు వేయాలని మాత్రమే కమల్‌నాథ్ కోరారని ఆమె వివరణ ఇచ్చారు. కాని ఎడిట్ చేసిన కొన్ని దృశ్యాలను మాత్రమే తమకు అనుకూలంగా బీజేపీ ప్రచారం చేసుకుంటోంది అని ఆమె ఆరోపించారు. .

ఈ నేపథ్యంలో మతం ఆధారంగా ఓట్లడిగిన కమల్‌నాథ్‌ తో పాటు కాంగ్రెస్‌ పార్టీపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ నేతృత్వంలో బీజేపీ బృందం ఎన్నికల సంఘానికి వినతిపత్రాన్ని సమర్పించింది.