నందమూరి సుహాసినికి తెలంగాణ సెంటిమెంట్ షాక్ !

సాధారణ గృహిణిగా ఉన్న దిగవంత నందమూరి హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసినిని తన రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసం సతమతమవుతున్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూకటపల్లిలో తెలుగు దేశం అభ్యర్ధిగా పోటీ చేయించడం ఆ పార్టీ నేతలకే విస్మయం కలిగిస్తున్నది. నందమూరి కుటుంభానికి తప్ప సొంత పార్టీలో, చివరకు నందమూరి అభిమానులలో సహితం ఎవ్వరికీ తెలియని ఆమెను అనూహ్యంగా ఎన్నికల గోదాలోకి దించడం ద్వారా హరికృష్ణ మృతి సందర్భంగా పార్టీలకు అతీతంగా వెల్లడైన సానుభూతిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకొనే ఎత్తుగడకు టిడిపి అధినేత పాల్పడిన్నట్లు స్పష్టం అవుతున్నది.

అవసరానికి వాడుకొని, వదిలివేసే చంద్రబాబు ఎత్తుగడల పట్ల మంచి అనుభవం ఉన్న హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టిఆర్ ముందే జాగ్రత్త పడి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అక్క నామినేషన్ వేస్తున్నప్పుడు ట్విట్టర్ ద్వారా సందేశం పంపడమే తప్ప కనీసం హాజరు కాలేదు. తమ సందేశంలో తాతగారు ఎన్టిఆర్ స్థాపించిన, నాన్నగారు హరికృష్ణ పోషించిన టిడిపి అంటూ ప్రస్తావించారే తప్ప ఎక్కడా పొరపాటున కుడా చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావించనే లేదు. తొలుత కళ్యాణ్ రామ్ ను అభ్యర్ధిగా నిలబెట్టడం కోసం ప్రయత్నం చేయగా ఆయన సున్నితంగా తిరస్కరించిన్నట్లు చెబుతున్నారు.

భార్య భువనేశ్వరి ద్వారా సుహాసినిని పోటీకి ఒప్పింద్చారు. అటు మామ చుండ్రు శ్రీహరి గతంలో ఎంపిగా ఎన్నికై, రాజకీయంగా క్రియాశీలకంగా ఉండటం, ఇటు తాత, తండ్రులు కుడా రాజకీయాలలో క్రియాశీల పాత్ర వహించినవారు కావడంతో రాజకీయాల పట్ల కొంత ఆసక్తి ఉన్న ఆమె ముందు, వెనుక చూడకుండా, కనీసం తమ్ముళ్ళను సంప్రదించకుండా పోటీకి సిద్దపడింది. హరికృష్ణ కుటుంభంలో వారికి ఈ సీట్ ఇస్తున్నామని ముందుగా తెలంగాణలోని పార్టీ సీనియర్ నేతలకు కుడా చంద్రబాబు నాయుడు తెలపలేదు. దానితో ఇక్కడి నుండి పోటీ చేయడం కోసం మాజీ మంత్రి పెద్దిరెడ్డి సిద్దపడుతున్నా వారించే ప్రయత్నం చేయనే లేదు.

అయితే ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సెంటిమెంట్ ను పెద్ద ఎత్తున లేవనెత్తే ప్రయత్నం కెసిఆర్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఆధర్యంలోని కూటమి అధికారంలోకి వస్తే అమరావతి నుండే పాలన జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న సీమంధ్ర ప్రజలు సహితం స్థానిక నేతలతో సర్దుబాటుకు సిద్దంగా ఉన్నారని, ఇక్కడి ప్రభుత్వం బెదిరిస్తే అర్ధంతరంగా అమరావతికి వెళ్ళిపోయినా చంద్రబాబు నాయుడును నమ్ముకొనే పరిస్థితులలో లేరని గత సంవత్సరం మొదట్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు స్పష్టం చేసాయి.

రాష్ట్ర విభజనను నిరసిస్తూ సుహాసిని తండ్రి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఆమె మామగారు చుండ్రు శ్రీహరి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలసి జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపకుల్లో ప్రముఖులు. దానితో ఆమె కుటుంభ నేపధ్యమే ఇప్పుడు అభ్యర్ధిగా ఆమెకు ప్రతికూలతకు దారితీసే అవకాశం ఉన్నదని ఆమె మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు.

కూటమిలో కాంగ్రెస్ కేటాయించిన 14 సీట్లలో కుడా పోటీ చేయలేక 12 చోట్లనే అభ్యర్ధులను నిలబెట్టడం, తెలంగాణలో సొంతంగా ఎన్నికల ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ వెనుకడుగు వేస్తూండటం, ప్రచారం బాధ్యతను నందమూరి  బాలకృష్ణకు అప్పచెప్పడం అంతా హైదరాబాద్ లోని సీమంద్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

కేవలం కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి హైదరాబాద్ నగరంలో మాత్రమె రోడ్ షో లకు మాత్రమె చంద్రబాబు పరిమితం అవుతున్నారు. ఇక్కడ సొంతంగా పార్టీని నడపడానికి భయపడుతున్న నాయకులను నమ్మి, తమ అవసరాలకోసం నందమూరి కుటుంభాన్ని ముందు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనుకొనే వారిని నమ్మి వోట్లు ఏ మేరకు వేస్తారో చూడవలసి ఉంది.

పైగా తమకేవ్వరికి మాట మాత్రంగా కూడా చెప్పకుండా ఎన్నికలకు ముందే స్థానికంగా సుహాసినిని ఓటర్ గా నమోదు చేయించడం, ఆమె అత్తింటి పేరు `చుండ్రు’ అని కాకుండా రాజకీయలబ్ది కోసం `నందమూరి’గా నమోదు చేయించడం వంటి రాజకీయ ఎత్తుగడల పట్ల టిడిపి వర్గాలలోనే తీవ్ర అసమ్మతి వ్యక్తం అవుతున్నది.