కోన వద్ద జీఎమ్మార్ గ్రీన్‌ఫీల్డ్ కమర్షియల్ పోర్టు

తూర్పుగోదావరి జిల్లా కోన గ్రామంలో జీఎమ్మార్ గ్రూప్ ఓ గ్రీన్‌ఫీల్డ్ కమర్షియల్ పోర్టును అభివృద్ధి చేయనున్నది. కాకినాడ సెజ్ అనుబంధ విభాగమైన కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్ (కేజీపీఎల్) ఈ వాణిజ్య నౌకాశ్రయ ప్రాజెక్టును చేపట్టనున్నది. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేజీపీఎల్ అంగీకార ఒప్పందం కుదుర్చుకోగా, ఈ ప్రాజెక్టు పెట్టుబడి దాదాపు రూ.2,100 కోట్లు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ రాష్ట్ర విద్యు త్, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ పోర్ట్స్ కోయా ప్రవీణ్, కాకినాడ సెజ్ సీఈవో ప్రసన్న చల్లా, కాకినాడ సెజ్, పోర్ట్స్ ఉపాధ్యక్షుడు నాగార్జున తాడూరీ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. రూపకల్పన, నిర్మాణం, ఫైనాన్స్, నిర్వహణ, బదిలీ (డీబీఎఫ్‌వోటీ) ప్రాతిపదికన ఈ ప్రతిపాదిత పోర్టు నిర్మించనున్నట్లు జీఎమ్మార్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది.

ఈ పోర్టుతో కాకినాడ సెజ్ ప్రాంతంలో పారిశ్రామికీకరణ నూతన యుగం ప్రారంభం కాగలదన్న విశ్వాసాన్ని జీఎమ్మార్ వ్యక్తం చేసింది. అంతేగాక ఉపాధి అవకాశాలూ మెరుగుపడుతాయని, ముఖ్యంగా సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఇంచుమించు 2 వేల మందికి ఉపాధి లభించనున్నదని చెప్పింది. రిఫైనరీ, దాని అనుబంధ పరిశ్రమల్లోనూ మధ్య, దీర్ఘకాలంలో ఉపాధి అవకాశాలు పెరుగగలవన్న ఆశాభావాన్ని వెలిబుచ్చింది.