జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రద్దు

అనూహ్య పరిణామాల మధ్య జమ్ముకశ్మీర్ అసెంబ్లీ రద్దయింది. ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేస్తామంటే తాము అంటూ అటు పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎంమెహబూబా ముఫ్తీ, ఇటు జమ్ముకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (జేకేపీసీ) నేత సజ్జాద్ లోన్ బుధవారం ముందుకు రావడంతో గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఏకంగా అసెంబ్లీనే రద్దు చేశారు. ఇంకా రెండేండ్ల కాలవ్యవధి (2020 అక్టోబర్ వరకు) మిగిలి ఉండగానే 87 మంది సభ్యులు కలిగిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ రద్దయింది.

కాగా అంతకుముందు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) మద్దతుతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మెహబూబా ముఫ్తీ గవర్నర్‌కు లేఖరాశారు. ప్రస్తుతం తాను జమ్ములో అందుబాటులో లేనని త్వరలోనే వచ్చి కలుస్తామని పేర్కొన్నారు. పీడీపీ 29 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీ 15 మంది, కాంగ్రెస్ 12 మంది ఎమ్మెల్యేలు కలిసి.. తమకు 56 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని పేర్కొన్నారు. గవర్నర్ ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో ఈ లేఖను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ముఫ్తీ లేఖ బయటకు వచ్చిన కొద్దిసేపటికే జేకేపీసీ నేత సజ్జాద్ లోన్ కూడా తమకు మెజార్టీ మద్దతు ఉన్నదని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నమని పేర్కొంటూ గవర్నర్‌కు లేఖరాశారు. ఈ లేఖను గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శికి వాట్సప్ ద్వారా పంపారు. తమ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని, బీజేపీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఇతరులు తమకు మద్దతు ఇస్తున్నారని, ఇది సాధారణ మెజార్టీ కంటే ఎక్కువని తెలిపారు.

అసెంబ్లీని రద్దు చేయాలని గత ఐదునెలలుగా డిమాండ్ చేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ నేతలు అనూహ్యంగా మెహబూబాకు మద్దతు తెలపడం, ఆమె పార్టీ పిడిపికి చెందిన కొద్ది మంది శాసన సభ్యులు ఆమెపై తిరుగుబాటు చేసి, సజ్జాద్ లోన్ కు మద్దతు తెలపడంతో రాష్ట్రంలో రాజకీయ బేరసారాలకు తెరలేపిన్నట్లు అయింది. అయితే ఇప్పుడు

అసెంబ్లీ రద్దు నిర్ణయంపై పీడీపీ, కాంగ్రెస్ మండిపడ్డాయి. పీడీపీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో రాష్ట్రంలో జూన్ నుంచి గవర్నర్ పాలన కొనసాగుతున్నది. తాజాగా అసెంబ్లీ రద్దుతో లోక్‌సభ తోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది.