కేరళ సహాయక చర్యల్లో ఎపి రక్షక బృందాలు

కనీవినీ ఎరుగని వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పది కోట్ల రూపాయల మేర సహాయం తక్షణమే అందిస్తామని వెల్లడించారు.

 

కేరళ రాష్ట్రంలో వరద బీభత్సముతో ప్రజల నానా ఇబ్బందులు పడుతుండగా బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ నుండి అగ్నిమాపక శాఖకు చెందిన ప్రత్యేక రక్షక బృందాలను పంపారు. ఈ బృందాలు అక్కడ సీఎస్ ఆదేశాలకు అనుగుణంగా అవసరమైన అన్ని రోజులు వీరు సహాయక చర్యల్లో పాల్గొంటారని డిజి కె.సత్యనారాయణ తెలిపారు. ఒక డీఎఫ్ఓ, ఎడిఎఫ్ ఓ, ఐదుగురు ఎస్ ఎఫ్ ఓలు, 75మంది సిబ్బంది, రక్షక పరికరాలతో గన్నవరం విమానాశ్రయం నుంచి కొచ్చి వెళ్లారు.

 

కాగా, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు సీఎం చంద్రబాబునాయుడు ఫోన్ చేసి  ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమని చెప్పారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి సిబ్బంది మరబోట్లు, పడవలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను మంగళగిరి నుంచి కేరళకు ఏపీ ప్రభుత్వం పంపింది. ఆహార పదార్ధాలు, పాలు, పండ్లు, బిస్కెట్లను ప్రభుత్వం పంపనుంది.

 

ఇప్పటికే చంద్రబాబు కేరళకు రూ.10కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కేరళ వరద బాధితులకు తమ నైతిక సాయం ఉంటుందని, వస్తు సామగ్రి రూపంలోనూ సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు చెప్పారు. ఏపీ నుంచి సహాయ బృందాలను పంపేందుకూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

 

కేరళ త్వరగా విపత్తు నుంచి బయటపడాలని, అక్కడ తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. కష్టాల్లో ఉన్న కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. donation.cmdrf.kerala.gov.in ద్వారా సాయం చేయాలని కోరారు.