ఉసరవెల్లి చంద్రబాబు ... కన్నా మండిపాటు

రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి ద్రోహం చేశారని కాంగ్రెస్‌ పార్టీని దూషించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అదే పార్టీతో చేరడం ద్వారా చంద్రబాబు తనకన్నా ఊసరవెల్లి లాంటి వ్యక్తి దేశంలో ఎక్కడా లేడని స్పష్టం చేస్తున్నాడని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ద్వజమెత్తారు. దేశంలో ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రాలకు ఒరిగేది ఏమీ లేదని ఆయన స్పష్టం చేసారు. అందుకే 20 రాష్ట్రాల్లోనూ బీజేపీకి ప్రజలు పట్టం కడుతున్నారని ఆయన చెప్పారు. ఖమ్మం అసెంబ్లీ బిజెపి అభ్యర్థి వుప్పల శారద ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలు అమలుకు నోచుకోని వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని ద్వజమెత్తారు.

సుపరిపాలను అందివ్వలేక ప్రాంతీయ పార్టీలు చతికిల పడుతున్నాయని కన్నా చెప్పారు.  దేశంలో ఎక్కడా కూడా ప్రాంతీయ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని తెలిపారు.  జమ్ముకాశ్మీర్‌, అస్సాం, త్రిపుర లాంటి రాష్ట్రాల తో పాటు తెలంగాణలోనూ ఆ పరిస్థితి ఉందని పేర్కొన్నారు. 2014 లో రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీని సోనియా, రాహుల్‌ గాంధీని దుమ్మొత్తిపోసిన ఏపీ సీఎం చంద్ర బాబు నేడు కాంగ్రెస్‌ చంకన చేరాడని ఊసరవెల్లి కూడా ఇలాంటి రంగులు మార్చవని ఆయన ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందిందని కన్నా విమర్శలు కురిపించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను పక్కదోవ పట్టించి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడంలేదన్న సంకేతాలను ప్రచారం చేస్తున్నారని ద్వజమెత్తారు.  దేశంలో ప్రాంతీయ పార్టీలతో విసిగిపోయిన ప్రజలు బీజేపీకి అధికారాన్ని అప్పగిస్తున్నాయని భరోసా వ్యక్తం చేసారు. దేశ వ్యాప్తంగా సేవచేసేందుకు బీజేపీ ప్రభుత్వం నీతి నిజా యితీగా పరిపాలను అందిస్తోందని హామీ ఇచ్చారు.

బడుగుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు 126 రకాల ప్రత్యేక కార్యక్రమాలను బీజేపీ ప్రభుత్వం అమలుచేస్తుందని కన్నా తెలిపారు. అవినీతి రహిత పాలనను అందిస్తున్న మోదీకి దేశప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. ఖమ్మం జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వం అందించిన అమృ త్‌ పథకం కింద వచ్చిన రూ100కోట్లను కమీషన్లు రాకపోవడంతో ఖర్చుచేయలేదని ఆరోపించారు.  ఇంతకన్నా నీతిహీనం ఏముం దనికన్నా ప్రశ్నించారు. అవినీతిపార్టీలకు ఓటేయ్య కుండా నీతివంతమైన బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు.