25న అమిత్ షా, 27న మోడీ తెలంగాణలో ప్రచారం

తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. వీరిద్దరి పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. మోదీ రెండు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనుండగా, అమిత్‌ షా మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు.

ఈ నెల 27 ఉదయం నిజమాబాద్‌, మధ్యాహ్నం వరంగల్‌లో జరిగే బహిరంగసభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. డిసెంబర్ 3న హైదరాబాద్ బహిరంగ సభ​కు ప్రధాని హాజరవుతారు.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ రానున్నారు. ఈ నెల 24 రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకొంటారు. హైదరాబాద్‌లోనే రాత్రి బస చేస్తారు. 25న 12 గంటలకు పరకాలలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:45 నిమిషాలకు నిర్మల్‌లో ఏర్పాటుచేసిన సభలోనూ, అక్కడి నుంచి వెళ్లి 3.20 నిమిషాలకు దుబ్బాక బహిరంగ సభ తర్వాత 4:45 నిమిషాలకు మేడ్చల్‌ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 

ఈ నెల 28న మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో ఉదమం 10.30 నిమిషాలకు హైదరాబాద్‌ చేరుకొంటారు. మధ్యాహ్నం 12 గంటల​కు ఆదిలాబాద్‌ సభలోనూ, తర్వాత 2 గంటల​కు జరిగే చౌటుప్పల్‌లో సభలో పాల్గొంటారు. 3:45 గంటలకు హిమాయత్ నగర్ లిబర్టీ నుంచి ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌ వరకు జరిగే రోడ్ షో లో పాల్గొంటారు. అనంతరం ఎల్బీనగర్‌ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

డిసెంబర్‌ 2న మరోసారి తెలంగాణ వచ్చి నాలుగు సభల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. తర్వాత 12 గంటలకు నారాయణపేట సభలో, 1.35 నిమిషాలకు ఆమనగల్‌లో కల్వకుర్తి బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉప్పల్‌, మల్కాజిగిరిలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. సాయింత్రం 5.15 నిమిషాలకు కామారెడ్డిలో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు.