రాజకీయాలకు దూరం కానని స్పష్టం చేసిన సుష్మా స్వరాజ్

ఇకపై ఎన్నికల్లో పోటీచేయబోనని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, బిజెపి సీనియర్‌ నేత సుష్మా స్వరాజ్‌ ప్రకటించడం దేశంలో సంచలనం కలిగించింది. ఆరోగ్య పరమైన కారణాల వల్ల ఇక నుంచి ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకావడంతో రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగడం లేదని ప్రకటించారు.

అయితే తాజా నిర్ణయంతో ఆమె మొత్తంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారంటూ భిన్న రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాను కేవలం ఎన్నికలకు మాత్రమే దూరంగా ఉంటున్నానని, రాజకీయాలకు దూరం కావట్లేదని సుష్మా స్వరాజ్‌ ట్విటర్‌ ద్వారా ఆమె ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు.  

‘ఆరోగ్య కారణాలతో సుష్మా స్వరాజ్‌ ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేయనని వెల్లడించారు. అంతేకాని ఆమె రాజకీయాల నుంచి దూరమవుతున్నారని కాదు. లోక్‌సభలో ఆమె లేకున్నా.. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడూ ముందే ఉంటారు’ అని రాజ్యసభ సభ్యుడు స్వపన్‌ దాస్‌ గుప్తా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

దాస్‌ గుప్తా ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ..‘మీరు చెప్పింది నిజమే స్వపన్‌. నేను కేవలం ఆరోగ్య కారణాల రీత్యా మాత్రమే వచ్చే లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నాను. అంతేకానీ మొత్తంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని కాదు..’ అంటూ సుష్మా పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ కూడా సుష్మా వ్యాఖ్యలపై ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘ఇక నుంచి పార్లమెంట్‌కు పోటీచేయనని సుష్మా స్వరాజ్‌ తీసుకున్న నిర్ణయానికి బాధగా ఉంది. దౌత్య విభాగంలో దేశానికి ఆమె గర్వించదగ్గ సేవలు అందించారు. పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల కమిటీకి ఛైర్‌పర్సన్‌గా నేను ఒక మర్యాదపూర్వకమైన విదేశాంగ మంత్రిని చూశాను.’ అంటూ శశిథరూర్‌ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. అతని వ్యాఖ్యలపై స్పందించిన సుష్మా ధన్యవాదాలు తెలిపారు.