టీఆర్‌ఎస్‌ నుంచి ఎంత ప్యాకేజ్‌ తీసుకున్నావ్ ఒవైసీ !

కాంగ్రెస్‌ 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చూసిందన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ టీఆర్‌ఎస్‌ నుంచి ఎంత ప్యాకేజ్‌ తీసుకున్నారో చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు ప్రశ్నించారు. అటు కాంగ్రెస్‌, ఇటు టీఆర్‌ఎస్‌తో కాపురం చేసేందుకు మజ్లీస్‌ సిద్ధమయిందని, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే.. ఒవైసీ వాళ్ల వద్దకు వెళ్తాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘నేను నిర్మల్‌ రాకుండా ఉంటే రూ.25 లక్షలు ఇస్తానని కాంగ్రెస్‌ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి ఆఫర్‌ ఇచ్చాడు. నన్ను డబ్బులతో కొనలేరు’అని నిర్మల్‌ సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర ఆరోపణ చేయడం తెలిసిందే.

మద్యం అమ్మకాల్లో, నేరాల పెరుగుదలలో, దేశ ద్రోహులను పెంచడంలో, మీడియా మీద అంక్షలు పెట్టడంలో, అవినీతిలో, అబద్దాలు చెప్పడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నంబర్‌ 1 స్థానంలో నిలిచిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీని దేశ ప్రజలు తిరస్కరించారని.. ఈ ఎన్నికల తర్వాత సమీకరణాలు మారుతాయని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఇచ్చిన రూ 500 కోట్లతో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

కాగా, అలాగే మంగళవారం టీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పిన చేసిన కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తన రాజీనామా లేఖలో ప్రస్తావించిన అంశాలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అమరుల కోసం రాజీనామా చేశానని చెప్పిన విశ్వేశ్వర్‌రెడ్డి వారి కుటుంబాలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు.

కారుకు పంక్చర్‌ కాబోతుందనే పార్టీ మారుతున్న విశ్వేశ్వరరెడ్డి పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నాడని వ్యాఖ్యానించారు. రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అయ్యాక పార్టీ పరిస్థితి మరింత బ్రష్టు పట్టిందని విమర్శించారు.