ప్రాజెక్టులన్నింటిలో పోటెత్తుతున్న భారీ వరద

తెలంగాణలో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులన్నింటికీ భారీ వరద పోటెత్తుతున్నది. నాలుగేండ్ల తరువాత నాగార్జునసాగర్‌కు జలకళ వస్తున్నది. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి మూడు లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా, దిగువకు లక్ష క్యూసెక్కులకు పైగా విడుదల చేస్తున్నారు. అటు ఆల్మట్టి.. ఇటు తుంగభద్రకు భారీ ఇన్‌ఫ్లోలు కొనసాగుతున్న దరిమిలా సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం కూడా ఆయకట్టుకు సాగునీటి విడుదలకు సిద్ధమవుతున్నది.

 మరోవైపు గోదావరి తన ఉగ్రరూపాన్ని చూపుతున్నది. ముఖ్యంగా బేసిన్‌లోని ఎస్సారెస్పీకి తొలుత 80 వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి ఆపై తగ్గింది. కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో స్థిరంగా కొనసాగుతున్నది. శుక్రవారం 1.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదుకాగా, అంతేమొత్తం దిగువకు విడుదల అవుతున్నది. నారాయణపూర్‌కు అక్కడి నుంచి జూరాలకు ఇదే రీతిన వరద వస్తున్నది. శుక్రవారం సాయంత్రం జూరాలకు ఇన్‌ఫ్లో 1.66 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 48 వేల క్యూసెక్కులు, 17 గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా1,22,819 క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు.

మరోవైపు కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో 1,49,186 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,45,320 క్యూసెక్కులుగా నమోదయింది. మొత్తం 33 గేట్లు ఎత్తి 1,79,830 క్యూసెక్కుల నీటిని దిగువన సుంకేశులకు విడుదల చేస్తున్నారు. సుంకేశుల బరాజ్ ఇన్‌ఫ్లో 1,87,000 క్యూసెక్కులు ఉండగా, 20 గేట్లను 4 మీటర్ల మేర ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు.

ఒకవైపు జూరాల, మరోవైపు సుంకేశుల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. జలాశయానికి శుక్రవారం సాయంత్రం 3.19 లక్షల భారీ ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 182 టీఎంసీల నిల్వకు చేరుకున్నది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పోతిరెడ్డిపాడు, కల్వకుర్తి అవుట్‌ఫ్లోతో కలిపి మొత్తం 1.02 లక్షల క్యూసెక్కుల జలాలను దిగువకు వదులుతున్నారు

వర్షాలతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంటున్నది. ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్ట్ నుంచి శుక్రవారం ఉదయం 93 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలను, గజ ఈతగాళ్లను రంగంలోకి దింపింది.

తెలుగు రాష్ర్టాలకు అత్యంత కీలకమైన నాగార్జునసాగర్ జలాశయానికి ఈసారి జలకళ వచ్చినట్లేనని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. 2014లో చివరిసారిగా సాగర్‌కు భారీ వరద వచ్చి నిండుకుండలా మారింది. ఆ ఏడాదిలో 563.39 టీఎంసీల జలాలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి సాగర్‌కు అంతస్థాయిలో వరద నమోదు కాలేదు.