అవినీతిని పెకలించేందుకే చేదు గుళికగా నోట్ల రద్దు

చెదల నివారణలో విషపూరిత మందుల్ని వాడే రీతిలోనే.. దేశంలో బలంగా వేళ్లూనుకుపోయిన అవినీతికి తగిన చికిత్స చేయడానికి చేదు మందుగా పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి డబ్బును తీసుకురావడం తమ ఉద్దేశమని చెప్పారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఝబువా, రేవాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని ప్రసంగించారు.

దేశాన్ని అవినీతి ఊబి నుంచి రక్షించేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు పెద్ద నోట్లరద్దు అనే కఠినమైన వైద్య విధానాన్ని అమలు చేసినట్లు ప్రధానమంత్రి తెలిపారు.. దేశంలో అవినీతి సొమ్ము చలామణిని అరికట్టి, బ్యాంకుల పరిధిలోకి ఈ సొమ్మును తెచ్చామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఓటర్లు విధేయత, సమగ్రతకు ప్రాధాన్యత ఇచ్చి బీజేపీకి ఓటు వేయాలన్నాని కోరుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే అవినీతికి ఓటు వేసినట్లే అని హెచ్చరించారు.

పెద్దనోట్ల రద్దుకు ముందు డబ్బును తమ పడకలు, ఇళ్లు, కార్యాలయాలు, కర్మాగారాల్లో దాచిపెట్టేవారంతా అణా పైసలతో ఇప్పుడు పన్నులు చెల్లిస్తున్నారని ప్రధాని చెప్పారు. ప్రస్తుతం ప్రతి పైసాకు పన్ను చెల్లిస్తున్నారని పేర్కొన్న ప్రధాని మోదీ ఆ నిధులను పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పన్నులు చెల్లించే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరమైందని పేర్కొన్నారు.

ప్రధాన్ మంత్రి ముద్ర యోజన కింద పరిశ్రమలు స్థాపించేందుకు రుణాలు చెల్లిస్తున్నామని చెబుతూ అభివృద్ధి, సంక్షేమంపై పదేళ్లలోకూడా కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని, తమ పార్టీ నాలుగేళ్లలో చేసి చూపించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సంక్షేమం అంటే గిట్టదని దయ్యబట్టారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వని కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయరాదని స్పష్టం చేసారు. దీని వల్ల పేదరికం, ఆర్థిక అసమానతలు పెరుగుతాయని హెచ్చరించారు.

`మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ కింద 14 కోట్ల మంది ప్రజలకు రుణాలిచ్చింది. అదీ ఎలాంటి పూచీకత్తు అడగకుండానే..! ఈ పని కాంగ్రెస్‌ చేయాలంటే పదేళ్లు పట్టేది...’ అని వివరించారు. అందరికి ఇల్లు అనే బృహత్తర ప్రణాళికను చేపట్టామని చెబుతూ2022 నాటికి అందరికీ పక్కా ఇళ్లు నిర్మించడమే తన లక్ష్యమని, ఇప్పటి వరకు సుమారు 1.25 కోట్ల మందికి సొంతిళ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు.

మధ్యప్రదేశ్‌కు రెండు ఇంజిన్లు (కేంద్ర, రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది) ఉన్నాయని ఓటర్లకు గుర్తుచేశారు. రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ 15 ఏండ్లుగా అధికారంలో ఉన్నారు. కానీ గత నాలుగున్నరేండ్లలోనే సమర్థవంతంగా పనిచేశారు. అంతకుముందు యూపీఏ హయాంలో కేంద్రంతో హక్కుల కోసం పోరాడారు అని మోదీ చెప్పారు. యూపీఏ పాలనకు మేడం కీ సర్కార్, రిమోట్ కంట్రోల్ వాలీ సర్కార్ అనే పేరుందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రాభివృద్ధి గురించి పట్టింపు లేని ప్రభుత్వం మధ్యప్రదేశ్‌కు వద్దని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో 14 ఏళ్ల క్రితం వైద్య సేవలు అందుబాటులో ఉండేవికావని, కాన్పుల కోసం సుదూరంలో ఉన్న పట్టణాల్లోని ఆసుపత్రులకు వెళ్లే స్థితి ఉండేదని గుర్తు చేసారు. ఈ రోజు ప్రజల వద్దకే వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. ప్రజలు రోజుకు పది గంటలు పనిచేస్తే తాను రోజుకు 11 గంటలు పనిచేస్తానని చెప్పారు. 

యూపీఏ హయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు కాంగ్రెస్ ద్వంద్వ నీతి నుంచి రక్షించుకున్నారని కొనియాడారు. కాంగ్రెస్‌తో పోలిస్తే రాష్ట్రంలో 15 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించి ఓటేయాలని కోరారు.

నెహ్రూ-గాంధీ కుటుంబం లక్ష్యంగా చేసుకున్న ప్రధాని మోదీ.. దేశ చరిత్రలో ఢిల్లీలో నాలుగోతరం వారసులు విజయవంతమైన దాఖలాలు లేవు. కాంగ్రెస్‌కు కూడాఅదే గతి పడుతుంది అని స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీలో సామాన్యులకు అవకాశం ఉండదని,  కీలక పదవులన్నీ ఒకే కుటుంబం వారే అనుభవిస్తున్నారని పేర్కొంటూ వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ ప్రతీక అని ద్వజమెత్తారు. చరిత్ర తిరగేస్తే దిల్లీలో ఎంతపెద్ద సుల్తాన్ల వంశపారంపర్య పాలనైనా నాలుగో తరం తర్వాత కొనసాగిన దాఖలాలు లేవని, ఇప్పుడు కాంగ్రెస్‌కీ అదే గతి పడుతుందని చెప్పారు.

కాంగ్రెస్‌ నేతలు అయోమయంలో ఉన్నారని, ఆ పార్టీకి ‘ఫ్యూజు’ పోయినందున ప్రజలకు వారు ‘పవర్‌’ (అధికారం) ఇవ్వలేరని ఎద్దేవా చేశారు. యూపీ, బిహార్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ప్రజలు 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ను అధికారంలోకి రానీయడం లేదని గుర్తుచేశారు. ఉగ్రవాదులు, మావోయిస్టులు ఎన్ని హెచ్చరికలు చేసినా జమ్ముకశ్మీర్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బులెట్లపై బ్యాలెట్లే విజయం సాధించాయని కొనియాడారు.