అయ్యప్ప ఆలయానికి మరోవంక పర్యావరణ ముప్పు !

ఒకవంక సుప్రీం కోర్ట్ తీర్పు పేరుతో శబరిమలలోని అయ్యప్ప ఆలయం సంప్రదాయాలను, భక్తుల విశ్వాసాలను మంతగరపడం కోసం కేరళలోని సిపిఎం ప్రభుత్వం విఫల యత్నం చేస్తుండగా, మరోవంక ఈ ఆలయంకు పర్యావరణ ముప్పు ఉన్నదనే స్పష్టమైన హెచ్చరికను సుప్రీం కోర్ట్ చేయడం గమనార్హం.  అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రస్తుతం వివాదం చెలరేగుతూ ఉండడంతో,  సుప్రీం కోర్టు అయ్యప్ప ఆలయానికి సంబంధించి జారీ చేసిన మరో కీలకమైన ఉత్తర్వులు మరుగున పడిపోయాయి.

శబరిమల పరిసర ప్రాంతాల్లోని అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని జస్టిస్‌ మదన్‌ బీ లోకుర్‌ నాయకత్వంలోని సుప్రీం కోర్టు బెంచీ నవంబర్‌ 2వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. మొదటి వివాదం భక్తుల నమ్మకానికి సంబంధించినది కాగా, పొంచి ఉన్న వివాదం పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది.

ఒకప్పుడు సన్నిదానంలో శబరిమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండేది. ఇప్పుడు దాని చుట్టూ 63.5 ఎకరాల పరిధిలో చెట్లుపోయి కాంక్రీటు జంగిల్‌ ఆవిర్భవించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలంటే ఈ కాంక్రీటు జంగిల్‌లో 90 శాతం కట్టడాలను కూల్చాల్సిందే. శబరిమల ఆలయం పరిసరాల్లో పర్యావరణ పరిస్థితులను పరిరక్షించాలంటూ కోజికోడ్‌కు చెందిన సామాజిక కార్యకర్త శోభీంద్రన్‌ నాలుగేళ్ల క్రితం సుప్రీం కోర్టులో పిల్‌ వేశారు.

దాంతో శబరిమల ఆలయం పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే అక్రమ కట్టడాలను పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ఓ కేంద్ర కమిటీని సుప్రీం కోర్టు ఆదేశించింది. అటవి ప్రాంతాల్లో గనులు, పరిశ్రమలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల అమలును పర్యవేక్షించే కమిటీయే ఇది. ఈ కమిటీ ఇటీవలనే సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో అనేక భయానక వాస్తవాలు బయట పడ్డాయి.

శబరిమల ఆలయం భక్తుల నుంచి వస్తున్న భారీ ఆదాయానికి ఆశపడి 1998లో కేరళ అసెంబ్లీ ఆమోదించిన ఆలయం మాస్టర్‌ ప్లాన్‌నే కాకుండా ఆ తర్వాత 2007లో తీసుకొచ్చిన సవరణ ప్లాన్‌ను కూడా ఉల్లంఘించి కేరళ దేవస్థానం బోర్డు పలు అక్రమాలను నిర్మించిన విషయాన్ని కమిటీ నివేదిక వెల్లడించింది.

ప్రజల విశ్వాసాన్ని అణచి వేస్తున్న కేరళ

ఇలా ఉండగా, శబరిమల వ్యవహారంలో కేరళ ప్రభుత్వం భక్తుల విశ్వాసాలను అణచివేసేలా ప్రవర్తిస్తోందని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షా విమర్శించారు. ఆలయానికి వచ్చే భక్తులను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‘గులాగ్‌ ఇన్‌మేట్స్‌’గా (జోసెఫ్‌ స్టాలిన్‌ హాయాంలోని సోవియట్‌ యూనియన్‌లో లేబర్‌ క్యాంపులను ఏర్పరిచి అందులో లక్షల మందిని బలవంతంగా నిర్బంధించిన వ్యవస్థ) పరిగణిస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడి విశ్వాసాన్ని పరిరక్షించేందుకు బిజెపి కట్టుబడి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

 ‘‘శబరిమల భక్తుల విషయంలో కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అసంతృప్తిగా ఉంది. బాలికలు, మహిళలు, వృద్ధుల పట్ల కేరళ పోలీసులు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. దర్శనం కోసం వచ్చిన వారికి కూడు, గూడు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. తీర్థయాత్రకు వచ్చిన వారికి చుక్కలు చూపిస్తున్నారు.’’ అని మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు.