కేరళకు రూ 500 కోట్లు సహాయం ప్రకటించిన మోడీ

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ర్టానికి తక్షణ ఆర్థిక‌ సాయంగా రూ.500కోట్లు స‌హాయ నిధిని అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వరద నష్టాలను పరిశీలించడానికి గతరాత్రి కేరళకు చేరుకున్న ప్రధాని మోదీ శనివారం ఉదయం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో జరిగిన ఉన్నతాధికార సమావేశంలో పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్ర గవర్నర్ సదాశివం, కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా జరిగిన సమీక్షలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనావేసి, సహాయ చర్యల కోసం అవసరమైన సహాయంపై ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. మృతుల కుటుంబాల‌కు రూ.2లక్షలు, తీవ్రంగా గాయాలపాలైన వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

 

కేరళలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించి, రాష్ర్టానికి తక్షణ ఆర్థిక సాయం కింద రూ. 500 కోట్ల సహాయం  ప్రకటించటం పట్ల ముఖ్యమంత్రి విజయన్ కృతజ్ఞతలు తెలిపారు.  . తదుపరి అన్ని విధాలా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని మోదీ భరోసానిచ్చినట్లు సీఎం తెలిపారు.   మరిన్ని హెలికాప్టర్లు, బోట్లు సమకూర్చాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయలేకపోయామని విజయన్ చెప్పారు.

 

ఇట్లా ఉండగా, కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కోరారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతల నెల వేతనాన్ని కేరళకు విరాళంగా ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించింది. కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నారు.

కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమవుతున్న కేరళ రాష్ర్టానికి బీహార్ ముఖ్యమంత్రి రూ. 10 కోట్లు, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రూ. 10 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి రూ 10 కోట్లు, తెలంగాణ ముఖ్యమంత్రి రూ 25 కోట్ల సహాయం  ప్రకటించారు


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తనవంతు సాయంగా రూ.2కోట్లను సీఎం సహాయనిధికి ఇవ్వనున్నట్లు తెలిపింది. కేరళలో అన్ని భారతీయ స్టేట్ బ్యాంకుల్లో నిర్వహిస్తున్న లావాదేవీలు, తదితర సేవలపై విధించే ఫీజుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.