ప్రతి భూమికి ఇక భూధార్‌ కార్డ్

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి భూభాగానికి 11 అంకెల విశిష్ట సంఖ్యను అందించే ‘భూధార్‌’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు.  ‘భూసేవ’ పేరుతో ప్రవేశపెడుతున్న ఈ ప్రాజెక్టుతో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా షేర్లు అమ్ముకున్నంత సులభంగా భూ క్రయ విక్రయాలు జరుపుకోవచ్చునని చెప్పారు. భూసేవ ప్రాజెక్టులో భాగంగా ఎండోమెంట్, వక్ఫ్, అటవీ భూముల వివరాలన్నింటినీ సమీకృతం చేస్తున్నామని తెలిపారు. ఈ తరహా ప్రాజెక్టును తీసుకురావడం దేశంలోనే ఇది తొలిసారి అని చెబుతూ ఆధార్‌ కార్డులో వ్యక్తుల వివరాలు ఉన్నట్టే భూధార్ కార్డులో భూముల వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

‘ఎక్కడైనా పొలాల దగ్గరే గొడవలు పడతారు. సరిహద్దు తగాదాలు వస్తాయి. ఇరుగుపొరుగు, చివరికి అన్నదమ్ములు కూడా పొలం గట్ల తగాదాలతోనే కత్తులు దూస్తారు. భూసేవ ద్వారా ఇకపై ఇలాంటి వివాదాలు ఉండవు. ప్రతి భూమికి ఒక క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ సహాయంతో భూమికి సంబంధించిన కచ్చితమైన కొలతలు తెలుసుకునే వీలు కలుగుతుంది. షేర్లు అమ్ముకున్నట్టే భూములను సులభంగా విక్రయించేందుకు కొత్తగా తీసుకొచ్చిన ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుంది’ అని ముఖ్యమంత్రి వివరించారు.

కాగా, ఎంతో కాలంగా వివాదాస్పదంగా ఉన్న ఆరు రకాల భూములకు సంబంధించిన సమస్యకు నెలరోజుల వ్యవధిలో తుది పరిష్కారాన్ని చూపిస్తామని ముఖ్యమంత్రి  ప్రకటించారు. 80 వేలకు పైగా ఉన్న చుక్కల భూముల కేసులు, 24 వేల ఈనాం భూముల కేసులు, లక్ష వరకు ఉన్న సొసైటీ భూముల కేసులు, ఇంకా వివాదాల్లో ఉన్న ఇతర భూములన్నింటినీ నిశిత పరిశీలన చేయించి అవి ఎవరి పేరు మీద వుంటే వారికి పట్టాలిచ్చి పరిష్కరిస్తామని వివరించారు. చుక్కల భూముల సమస్యకు చెక్ పెట్టడానికి అధికారులకు నెలరోజులు గడువు ఇచ్చానని, ఈ నెల రోజుల్లోనే ఎక్కడికక్కడ గ్రామసభలు పెట్టి ఆయా భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో చూసి వారికి యాజమాన్యపు పట్టాలిస్తామని చెప్పారు.

దేశంలో నిత్యం 3 కోట్ల మంది వినియోగిస్తున్న ఆధార్ ఏవిధంగా పెను మార్పులు తీసుకొచ్చిందో ఇప్పుడు ఏపీలో ప్రవేశపెడుతున్న భూధార్ కూడా అదే మార్పు తీసుకొస్తుందని ఐటీ సలహాదారు, ఉడాయ్ చైర్మన్ జె. సత్యనారాయణ చెప్పారు. భూధార్ కోసం తొలిసారి అత్యాధునిక కోర్స్ టెక్నాలజీని వినియోగించామని తెలిపారు. వచ్చే ఫిబ్రవరి నాటికల్లా రాష్ట్రవ్యాప్తంగా భూసేవ ప్రత్యేక టవర్లను ఏర్పాటు చేస్తారని చెప్పారు. భూ భాగాల మ్యాప్‌లను అందించేందుకు మొబైల్ ఫోన్ సైజులో ప్రత్యేకమైన డివైస్ ప్రవేశపెట్టామని చెప్పారు.

రూ.30 నుంచి రూ.60 లోపు ఖర్చు పెట్టి ఇ-సేవా కేంద్రాలలో భూధార్ కార్డులను తీసుకునే వీలుందని తెలిపారు. 2,39,69,159 రెవిన్యూ, వ్యవసాయ భూములలో ఇప్పటికే కోటీ 39 లక్షల భూభాగాల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చి భూధార్ కార్డులు అందిస్తున్నామని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ను భూ వివాద రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని  ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు.  ‘కోర్స్’ అనే అత్యాధునిక సర్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా శాశ్వత భూధార్ సంఖ్యను కేటాయిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి భూధార్ ద్వారా మ్యుటేషన్, సబ్ డివిజన్, జియో రిఫరెన్సింగ్ వంటి సేవలను అందిస్తున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి ‘భూసేవ’ పోర్టల్‌ను, ఇ-భూధార్, మొబైల్ ఆధార్ కార్డులను ప్రారంభించారు. https://bhuseva.ap.gov.in లింకు నుంచి వెళ్లి భూసేవ పోర్టల్‌ సేవలను అందుకోవచ్చు. భూసేవ ప్రాజెక్టులో భాగంగా రైతుల భూకమతాలను సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సెక్యురిటీ పాలసీని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్బంగా ఆవిష్కరించారు..