టీఆర్ఎస్‌కు చేవెళ్ల ఎంపీ కొండా రాజీనామా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు వారాల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి టీఆర్ఎస్‌కు గట్టి షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన అనూహ్యంగా ప్రకటించారు. ఈ మేరకు మూడు పేజీల రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. రాజీనామాకు గల కారణాలను లేఖలో వివరించారు.

ప్రధానంగా ఐదు కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్‌లో సరైన గౌరవం లేదని, పార్టీ కోసం కష్టపడుతున్నకార్యకర్తలకు సరైన గౌరవం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్‌లో సంప్రదాయ రాజకీయాలు లేవని తెలిపారు. పార్టీ, రాష్ట్ర స్థాయిల్లో ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఎంపీగా తన నియోజకవర్గ ప్రజలకు ఆశించిన స్థాయిలో పనిచేశానని సంతృప్తి వ్యక్తం చేసారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎక్కడా ప్రచారంలో పాల్గొనడంలేదు.

పార్టీ గత రెండేళ్లుగా ప్రజలకు దూరమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అనేక సందర్భాల్లో పార్టీకి, ప్రజలకు అగాథం పెరిగిపోయిందని తనకు అనిపించిందని, ప్రభుత్వం కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శించారు.

కాగ, తన రాజీనామాకు గల కారణాలను బుధవారం మీడియా సమావేశంలో ప్రకటిస్తామని చెప్పారు. గత కొన్ని రోజులుగా కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడంలేదు. ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడతారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలియవచ్చింది.

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారని వెల్లడి కావడంతో గత వారం మంత్రి కేటి రామారావు ఆయనను పిలిపించుకొని నచ్చచెప్పే ప్రయత్నం చేసారు. ఎన్నికల దృష్ట్యా రాజీనామా విషయాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని కోరారు. కేసీఆర్‌తో మాట్లాడి చెబుతానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అయితే కేటీఆర్‌ ప్రయత్నాలు ఫలించలేదు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామాతో తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాసలో చేరిన విశ్వేశ్వర్‌ రెడ్డి ఆ తర్వాత చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి గెలుపొందారు.

టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపిలు ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు గతవారం ప్రకటించి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలనం కలిగించారు. మొదటగా కొండా రాజీనామా చేయడంతో, ఇప్పుడు రాజీనామా చేయబోయే రెండో ఎంపి ఎవ్వరో అనే ఆసక్తి కలుగుతున్నది.