తిత్లీ బాధితులకు కేంద్ర మంత్రి ఆహిర్ భరోసా

తిత్లీ తుపానుతో నష్టపోయిన అందరినీ కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర హోం శాఖ సహా యమంత్రి హన్సరాజ్‌ గంగారాం ఆహిర్‌ భరోసా ఇచ్చారు. టెక్కలి, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఆయన సోమవారం పర్యటించారు. వజ్రపుకొత్తూరు మండలం చినవంక, డోకులపాడు గ్రామాల్లో పర్యటించిన అయన తుపాను పాడైన కొబ్బరి తోటలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు.

ఇంతవరకు నష్టపరిహారం అందలేదని, పూర్తిగా పంటలు, ఇళ్లు నష్టపోయిన తమకు ఎవరూ ఆదుకోలేదని బాధితులు కేంద్రమంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కూడా కేంద్ర మంత్రి కలిశారు.

నష్టపరిహారాన్ని పెంచాలని, సాముహిక వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలని, నష్టపోయిన ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందించాలని, వ్యవసాయకూలీ కుటుంబాలకు 5 సంవత్సరాల పాటు నెలకు రూ.5 వేలు భృతి అందించాలని మత్య్సకారులకు తీర ప్రాం తంలో భూములకు పట్టాలు ఇప్పించాలని కోరుతూ  మండల వైఎస్సార్‌ సీపీ మహిళ కన్వీనర్‌ తామాడ సరస్వతి,జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పరపల్లి నీలవేణి తదితరులు మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు.

డోకులపాడులో తుపానుతో దెబ్బతిన్న ఇళ్లను మంత్రి పరిశీలించారు. బాధితులు మడ్డు రాజు, మడ్డు యర్రమ్మలతో మాట్లాడి ఎంత పరిహారం అం దిందని అడిగారు. వారు తమకు రూ.10 వేలు మాత్రమే అందిందని బదులు ఇచ్చారు. అలాగే బత్సలవానిపేట గ్రామానికి చెందిన బత్సల దాలమ్మ తమ అవేదనను హిందీలో చెప్పుకుంది. నష్టం కలిగిన వివరాలను అధికారులకు అందిస్తే న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

అనంతరం విలేకర్లతో కేంద్రమంత్రి  మాట్లాడుతూ నష్టపోయిన తీరును చూశానని, ఉద్దాన ప్రజలకు జరిగిన తీవ్ర నష్టం తనను బాధించిందని చెప్పారు. నష్ట తీవ్రతను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శారదపురంలో రోడ్డుపైన అధిక సంఖ్యలో రైతులు ఉండటంతో వారితో మాట్లాడి పర్యటనను ముగించారు.

కేంద్ర మంత్రి  వెంట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాల్, ఎంఎల్‌సీ పివి మాధవ్, విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ కణితి విశ్వనాథం, బీజేపీ పలాస నియోజకవర్గ ఇన్‌చార్జి కొర్రాయి బాలకృష్ణయాదవ్, ఇన్‌చార్జి కలెక్టర్‌ చక్రధర్‌బాబు పర్యటనలో పాల్గొన్నారు.