పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణస్వీకారం

పాకిస్థాన్ 22వ ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఆ దేశ అధ్యక్షుడు మామూన్ హుస్సేన్ ఇమ్రాన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం ఇస్లామాబాద్‌లోని అధ్యక్షుడి అధికారిక నివాసంలో జరిగింది.

ఇమ్రాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన భార్య బుష్రా ఇమ్రాన్, ఆర్మీ చీఫ్ జనరల్ కమార్ జావేద్ భజ్వా, ఎయిర్ చీఫ్ మార్షల్ ముజాహిద్ అన్వార్ ఖాన్, నావెల్ చీఫ్ అడ్మిరల్ జాఫర్ మహముద్ అబ్బాసీతో పాటు భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు, రమీజ్ రాజా, వసీం అక్రమం, గాయకులు సల్మాన్ అహ్మద్, అబ్రూల్ హక్, నటుడు జావిద్ షేక్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడిన.. ఇమ్రాన్‌ నేతృత్వంలోనే పాకిస్తాన్‌ 1992లో వరల్డ్‌ కప్‌ను గెలుచుకుంది. ఇమ్రాన్‌ఖాన్‌ లాహోర్‌లో 1952లో ఉన్నత మధ్యతరగతి పష్టున్‌ కుటుంబంలో జన్మించారు. అచిసన్‌ కాలేజీలో చదువుకున్నారు. ఆ అనంతరం ఇంగ్లాండ్‌లోని వోర్స్‌స్టర్‌లో రాయల్‌ గ్రామర్‌ స్కూల్‌ వోర్స్‌స్టర్‌లో, ఆక్స్‌ఫర్డ్‌లోని కేబుల్‌ కళాశాలలో విద్యాభ్యాసం కొనసాగించారు. 13 ఏళ్ల వయసులోనే ఇమ్రాన్‌ క్రికెట్‌ ఆడటం ప్రారంభించారు. తొలుత కాలేజీ తరుఫున, అనంతరం 18 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌ జాతీయ క్రికెట్‌ టీమ్‌లో పాలుపంచుకున్నారు. 1982 నుంచి 1992 వరకు పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌కు కెప్టెన్‌గా చేశారు.