తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం

తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల బాధ్యుడు జె.పి.నడ్డా భరోసా వ్యక్తం చేసారు. ముషీరాబాద్‌లో బిజెపి ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభిస్తు ప్రధాని మోదీ ప్రభంజనాన్ని చూసి భయంతోనే సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ద్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ పథకాలకు, కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తోందని, అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం కెసిఆర్ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటోందని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి రాష్ట్రంలో అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. కేంద్రం మంజూరు చేసిన నిధులను సక్రమంగా వినియోగించుకోలేదని విమర్శించారు. కెసిఆర్ పాలనకు విశ్రాంతి ఇవ్వాలని పిలుపిచ్చారు. మరోవంక, ఎన్టీఆర్‌ ఆశయాలకు భిన్నంగా స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నారని ధ్వజమెత్తారు.

దేశంలో మోదీ ప్లనలావు అనూహ్యమైన ప్రగతి సాధించగలిగామని కేంద్ర మంత్రి తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 కోట్ల మేర మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, 5,27,746 గ్రామాలు బహిర్భూమి లేని గ్రామాలుగా ప్రకటించడమైందని పేర్కొన్నారు.  అలాగే 530 జిల్లాలు బహిర్భూమి లేని ఒడిఎఫ్ జిల్లాలుగా రూపొందాయని చెప్పారు.  దేశంలో 96.21 శాతం ఇళ్లకు మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయని, మహిళలు గర్వపడే రోజు వచ్చిందని పేర్కొన్నారు. 2014లో మరుగుదొడ్ల శాతం 38.70 మాత్రమేనని అన్నారు.

ఆర్ధిక రంగం, పరిస్థితులను మెరుగుపరచడం, వ్యాపారాలు తేలికగా చేసుకోగలగడం, ప్రశాంతంగా అంతా జీవించగలగే వాతావరణాన్ని బీజేపీ తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు.  దేశంలో యువతకు అనేక అవకాశాలు కల్పించామని, వినూత్న ప్రయోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అలాగే దేశీయంగా అన్నీ తయారుచేసుకునేలా మేకిన్ ఇండియా, స్టార్టప్ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించామని, అన్ని రంగాల్లో కనెక్టివిటీని తెచ్చామని వెల్లడించారు.

రహదార్ల నిర్మాణం, హైదరాబాద్‌లో మెట్రో నిర్మాణం, మిగిలిన ప్రాంతాల్లో జల మార్గాలు కూడా ఏర్పాటు చేయడమైందని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతూనే రహదారుల కనెక్టివిటీని పెంచామని చెప్పారు. మూడు దశాబ్దాల్లో నిర్మించిన రోడ్లకు రెట్టింపు రోడ్లను నాలుగేళ్లలో నిర్మించామని ఆయన పేర్కొన్నారు.

ముషీరాబాద్‌ బిజెపి అభ్యర్థి, బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ ఎర్రవెల్లి, బోయిగూడలలో నిర్మించిన పది గృహాలను చూపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో సమరానికి సిద్ధం కావడానికి ఈ కార్యాలయం కేంద్రంగా మారిందని చెప్పారు. కార్యకర్తలు వ్యూహాత్మకంగా ప్రధాని నరేంద్రమోదీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. పేదలకు ప్రవేశపెట్టిన పథకాలు, వాటి ద్వారా అందుతున్న ఫలాలను చెప్పాలని పేర్కొన్నారు.