చంద్రబాబుకు తెలంగాణ టిడిపి నేతల షాక్ !

కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం నుంచి, అభ్యర్ధుల ఎంపిక వరకు తెలంగాణ తెలుగు దేశం పార్టీలోని సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారా ? ఎన్నికల వ్యూహంలో నాలుగేళ్ళుగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ నేతల ప్రలొభాలు, బెదిరింపులు, వేధింపులకు తట్టుకొని ఇంకా పార్టీలో కొనసాగుతున్న నేతలను కీలక రాజకీయ నిర్ణయాల విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వాసంలోకి తీసుకోలేదని చెబుతున్నారు. అందుకనే వారంతా ఎన్నికలలో పోటీ చేయకుండా చంద్రబాబుకు షాక్ ఇచ్చిన్నట్లు స్పష్టం అవుతున్నది.

కాంగ్రెస్ తో పొత్తు స్థానిక పరిస్థితుల మేరకు, స్థానిక నాయకత్వం తీసుకొంటున్న నిర్ణయంగా మొదట్లో అభిప్రాయం కలిగించే ప్రయత్నం చంద్రబాబు చేసినా ఇప్పుడు అదంతా తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా చెప్పకనే చెబుతున్నారు. తెలంగాణలో టిడిపి ప్రయోజనాల కోసం కాకుండా కాంగ్రెస్ కు జీవం పోసి నిలబెట్టడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో తన రాజకీయ ఉనికి కాపాడు కోవడం కోసం తమను `బలి’ కావిస్తున్నారనే అసంతృప్తి స్థానిక టిడిపి నేతలలో వ్యక్తం అవుతున్నది.

ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నప్పటికే తెలంగాణలో సీనియర్ నేతలుగా ఉంటున్న వారెవ్వరూ పోటీ చేయడం పట్ల ఆసక్తి చూపకపోవడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది. తద్వారా వారు   రాష్ట్రంలోని టిడిపి శ్రేణులకు తప్పుడు సందేశం పంపిన్నట్లు అయింది. తెలంగాణ టీడీపీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు వంటి నేతలు పోటీ చేయడానికి బలమైన నియోజకవర్గాలు అందుబాటులో ఉన్నా పోటీ చేయకపోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతున్నది.

పైగా, టిడిపి బలంగా ఉన్న పలు నియోజకవర్గాలను కాంగ్రెస్ కు అప్పచెప్పి, బలం లేని పలు సీట్లలో పోటీ చేస్తూ ఉండటం పట్ల పార్టీ వర్గాలలోనే ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. కాంగ్రెస్ 14 నియోజకవర్గాలు కేటాయిస్తే 13 చోట్లనే పోటీ చేయడం సహితం టిడిపి వర్గాలకే అంతుబట్టడం లేదు.

కోరుట్లలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ పోటీచేస్తారని మహాకూటమి ఏర్పాటు సమయంలో అందరూ భావించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ సీటును కూటమి గెలుపు కోసం త్యాగం చేస్తున్నట్టు రమణ ప్రకటించారు. పైగా ఆ సీట్ లో కాంగ్రెస్ కు బలమైన అభ్యర్ధి కుడా లేరు. ఇదే రీతిలో నిజామాబాద్‌ రూరల్‌ నుంచి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పోటీచేస్తారని పార్టీ కార్యకర్తలు ప్రచారం కుడా ప్రారంభించారు. తీరా ఆ సీట్ ను టీఆర్‌ఎస్‌ మాజీ నేత, ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది.

మరో సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారం రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. హుజూరాబాద్‌లో పోటీచేసే అవకాశం ఉన్నా వద్దనుకొని హైదరాబాద్ లోని కూకట్‌పల్లి ఎంచుకున్నారు. తీరా నామినేషన్ వేసే సమయానికి అక్కడ నందమూరి సుహాసినిని అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆయన ఎక్కడ పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అదే రీతిలో మహబూబ్‌నగర్‌ చెందిన టీడీపీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి సైతం పోటీచేయడానికి వెనుకడుగు వేసారు. అరవింద్‌కుమార్‌గౌడ్‌, శోభారాణి వంటి నేతలు సహితం పోటీకి దూరంగా ఉండవలసి వస్తున్నది. శేరిలింగంపల్లి, మహబూబ్ నగర్ వంటి చోట్ల ఆశ్చర్యకరమైన రీతిలో అభ్యర్ధులు రంగంలోకి రావడంతో సీట్లను అమ్ముకున్నారనే ఆరోపణలు పార్టీ వర్గాలలోనే వస్తున్నాయి.