ఖమ్మంలో అడుగు పెట్టాలంటే చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి 30 లేఖలు రాశారని పేర్కొంటూ  ఆయన జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాకే ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలిని తెలంగాణ ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేసారు. ఓట్ల కోసం జిల్లాకు వచ్చే చంద్రబాబును ప్రజలు నిలదీయాలని పిలుపిచ్చారు.

నామినేషన్ల ఘట్టం పూర్తి కాగానే ముందస్తు ఎన్నికల మలివిడత ప్రచారంలో భాగంగా ఖమ్మం, పాలకుర్తిలలో జరిగిన బహిరంగ సభలలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ మద్దతిచ్చే కూటమి గెలిస్తే జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే టీడీపీకి ఓటు వేస్తారో ఖమ్మం జిల్లా ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి కుట్రలు పన్నుతున్నాయని పెర్కొనాటు అభివృద్ధికి సహకరించని కాంగ్రెస్‌కు.. ఇప్పుడు టీడీపీ తోడైందని యద్దేవ చేసారు. “నేను ఢిల్లీలో చక్రం తిప్పుతానని, తోక తిప్పుతానని ప్రగల్భాలు పలకడం నాకు చేత కాదు. అయితే కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఒక కూటమిని తయారు చేయడం మాత్రం ఖాయం” అంటూ పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి చెప్పారు. త్వరలో ఈ పని మరింత వేగవంతం అవుతుందని వెల్లడించారు.

35 ఏళ్లు పాలించి ఏడిపించిన కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ ఆలోచించలేదని అంటూ ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కరెంటు పోతదని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్న అరవై ఏండ్లలో తెలంగాణకు నీళ్లు, విద్యుత్ ఎందుకు ఇవ్వలేదని కెసిఆర్ ప్రశ్నించారు. రూ.43వేల కోట్లతో మానవీయకోణంలో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని సీఎం చెప్పారు.

రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అభినందనలు వస్తుంటే.. కాంగ్రెస్, టీడీపీలకు కనిపించడంలేదని విమర్శించారు.

“పాలమూరు పూర్తవుతున్నయి. దేవాదుల కూడా పూర్తయితది. బ్రహ్మాండంగా నీళ్లొస్తయి. పంటలు బాగా పండుతయి. ఇండియాలో ధనవంతులైన రైతులు ఎక్కడున్నరంటే తెలంగాణల ఉన్నరనే పేరు రావాలి. అప్పటిదాకా రైతుల పక్షాన ఉంటా. ఆ పేరు రావాలంటే.. ఏ పంట ఎక్కడ వేయాల్నో అక్కడే వేయాలి. పండిన పంట ఆన్ డిమాండు అమ్ముడుపోవాలి. అందుకే మహిళాసంఘాల శక్తి వృథా కాకుండా ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తది. మహిళా సంఘాలన్నింటినీ యాక్టివేట్ చేసి, ఐకేపీ సిబ్బందిని పర్మినెంట్ ఉద్యోగులుగా చేసి వాళ్లకు జీతాలు కూడా పెంచి, బ్రహ్మాండంగా పనిచేయిస్తం. దేశంలోనే ఆదర్శ మహిళలు తెలంగాణలో ఉన్నారనే పేరు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తం" అంటూ హామీల వర్షం కురిపించారు.