టాప్-50లోకి తీసుకురావడమే లక్ష్యం

ప్రపంచ బ్యాంక్ సులభతర వ్యాపార నిర్వహణ దేశాల జాబితాలో భారత్‌ను వీలైనంత త్వరగా టాప్-50లోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశీయ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో మోదీ సమావేశమైన సందర్భంగా మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని ప్రస్తుతమున్న స్థాయితో పోల్చితే దాదాపు రెండింతలు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుస్తామని భరోసా వ్యక్తం చేస్తూ ఇందుకుగాను ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల నుంచి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో ఏర్పాటైన ఓ కమిటీని ఏర్పాటు చేశామని ప్రకటించారు. గత ప్రభుత్వాల హయాంలో సంస్కరణలు నత్తనడక నడిచాయన్న ఆయన తమ పాలనలో పరుగులు పెట్టిస్తున్నట్లు గుర్తుచేశారు.

ఈ క్రమంలోనే తాము అధికారం చేపట్టిన 2014లో 190 దేశాల ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకుల్లో భారత్ 142వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. అయితే 2017 నివేదికలో 130వ స్థానానికి, 2018లో 100వ ప్లేస్‌కు చేరుకున్నామన్నారు. ఇక 2019కి సంబంధించి విడుదలైన జాబితాలో 77వ స్థానంలో నిలిచామని వివరించారు. అన్ని అవరోధాలను అధిగమిస్తూ ముందుకెళ్తున్నామన్న మోదీ.. సాహసోపేతమైన, సంచలనాత్మక సంస్కరణల్ని ఆపబోమని, అవి ఇకపైనా కొనసాగుతాయన్న భరోసాను ఇండస్ట్రీ వర్గాల్లో కల్పించారు.

ఇందుకు తగ్గట్లే దేశంలో వ్యాపార విస్తరణను వేగవంతం చేయాలని వ్యాపారులను కోరారు. వ్యాపార నిర్వహణను మరింత సులభం చేసే దిశగా ప్రభుత్వ విధానాలుంటాయని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్), ఐక్యరాజ్యసమితికి చెందిన యూఎన్‌సీటీఏడీ.. భారత్ భవిష్యత్తుపై వ్యక్తం చేస్తున్న విశ్వాసమే తమ పాలనకు గీటురాయిగా అభివర్ణించారు.

కాగా, ఈవోడీబీ గ్రాండ్ చాలెంజ్‌నూ మోదీ ప్రారంభించగా, కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్, బ్లాక్‌చైన్ తదితర టెక్నాలజీలను సంస్కరించే ఆలోచనలకు ఆహ్వానం పలికారు.

వ్యాపార అవకాశాలు, నిర్మాణ అనుమతులు, విద్యుత్ సౌకర్యం, రుణ లభ్యత, పన్నులు, ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు, ఒప్పందాలు, దివాలా పరిష్కారాలు, విధానపరమైన నిర్ణయాలు తదితర అంశాల ప్రాతిపదికన ప్రపంచ బ్యాంక్ ఈవోడీబీ ర్యాంకులను ఆయా దేశాలకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. 2019 జాబితాలో న్యూజీలాండ్‌కు ప్రథమ స్థానం దక్కగా, సింగపూర్, డెన్మార్క్, హాంకాంగ్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికాకు 8వ స్థానం, చైనాకు 46వ స్థానం, పాకిస్తాన్‌కు 136వ స్థానం లభించాయి.