అమరావతిని రంగుల కలగా మార్చిన చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్  రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నాయుడు రంగుల కలగా మార్చడని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్‌ నరసింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అంటే తెగ దోచేసే ప్రభుత్వం అని కొత్త అర్థం చెప్పారు.

రాజధాని నిర్మాణం పేరిట చేస్తున్న దోపిడిపై టీడీపిని కడిగిపారేస్తూ రాజధాని నిర్మాణాన్ని తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టె అంశంగా మార్చరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి భూదందా వెనుక వేలకోట్ల కుంభకోణం ఉందని, అడ్డగొలుగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. తాత్కాలికి నిర్మాణాల ముసుగులో వెయ్యి కోట్లు స్వాహా చేశారని జీవిఎల్‌ ఆరోపించారు. అమరావతిని టీడీపీ తన వ్యాపారాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. 

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటుంటే.. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు పంటి వైద్యం కోసం సింగపూర్‌కు వెళ్లి లక్షలు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్‌ కన్సార్టియంకు అప్పగించిన 1690 ఎకరాల భూమిలో 1070 ఎకరాలను ఫ్లాట్‌లుగా అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినివ్వడంపై మండిపడ్డారు. ఆ కంపెనీ 306 కోట్ల పెట్టుబడులు పెట్టినదానికి 16 వేల కోట్ల విలువైన భూమిని అప్పగిస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రధానికి ఈ అక్రమాలపై సమాచారం ఉందని చెబుతూ ఈ ల్యాండ్‌ మాఫియాకు తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసారు. రాబోయే రోజుల్లో రెండు లక్షల కోట్ల అక్రమాలకు అమరావతి కేంద్రం కాబోతోందని ఆరోపించారు. అమరావతిని నల్లధనం అడ్డాగా, మరో స్విస్‌ బ్యాంక్‌గా చంద్రబాబు మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు