గూండాలుగా పేర్కొనడంతో కుమారస్వామిపై రైతుల ఆగ్రహజ్వాలలు

అధికారంలోకి వచ్చిన 24 గంటలలోగా రైతుల రుణాలను రద్దు చేస్తాననే హామీతో పదవి చేపట్టిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి పదవి చేపట్టి ఆరు నెలలు దాటినా ఆ దిశలో అడుగు వేయక పోవడంతో రైతులలో తీవ్ర అసహనం నెలకొంటున్నది. పైగా మద్దతు ధరలకోసం నిరసన ప్రదర్శనలు జరుపుతున్న చెరకు రైతులను `గూండాలు’గా పేర్కొనడంతో తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు గంటల లోగా బెంగళూరులో ఫ్రీడమ్ పార్క్ లో భైటాయింపు జరిపిన తమ వద్దకు కుమారస్వామి వచ్చి చర్చలు జరపని పక్షంలో రాష్ట్ర శాసన సభ `విధాన సౌదా’ను ముట్టడిస్తామని హెచ్చరిక చేసారు.

దానితో దిగివచ్చిన ముఖ్యమంత్రి మంగళవారం మధ్యాన్నం 12.30 గంటలకు విధాన సౌధ లోని కాన్ఫరెన్స్ హాల్ లో చర్చలకు రైతు ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సమావేశానికి చక్కర మిల్ యజమానులు, ఇతర సంబంధితులను కుడా ఆహ్వానించారు.

చక్కర ఫ్యాక్టరీల నుండి తమకు కోట్ల రూపాయిలలో చెల్లించవలసిన బకాయిలను తక్షణమే చెల్లించాలని, తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వేల సంఖ్యలో రైతులు ఫ్రీడమ్ పార్క్ కు చేరుకున్నారు. అదే విధంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రుణాలను రద్దు చేయాలనీ కోరుతున్నారు. దానితో రాష్ట్ర ప్రభుత్వం నిసాహాయ పరిస్థితిలో చిక్కుకున్నట్లు కనబడుతున్నది. అంతకు ముందు ఆదివారం నాడు ఫ్రీడమ్ పార్క్ కు పేర్కొన్న రైతులను `గూండాలు’గా పేర్కొంటూ ముఖ్యమంత్రి ప్రకటన ఇవ్వడం పట్ల వారు తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేసారు. సహకార మంత్రి బందేప్ప కషేమ్పూర్ పార్క్ వద్దకు వెళ్లి రైతులతో సమాలోచనలు జరిపారు.

పరిస్థితి తీవ్రతను గమనించిన కుమారస్వామి సోమవారం ఉదయం ఒక ప్రకటనలో `గూండాలు’గా పేర్కొంటూ తాను చేసిన ప్రకటన పట్ల విచారం వ్యక్తం చేసారు. అయితే క్షమాపణలు చెప్పడానికి తిరస్కరించారు. “బెలగావి నిరసన సందర్భంగా నా పట్ల చేసిన విమర్శల పట్ల నేను తీవ్ర వేదనకు గురవుతున్నాను. నా మాటలను అసందర్భంగా తీసుకోవడం దురదృష్టకరం” అని పేర్కొన్నారు.

ఇలా ఉండగా రైతుల ఆందోళనకు మద్దతుగా కార్యక్రమాలు తీసుకోవాలని కర్ణాటక బిజెపి నిర్ణయించింది. ఈ విషయమై చర్చించడం కోసం మంగళవారం పార్టీ కోర్ కమిటీ సమావేశం అవుతున్నది. “అవకాశవాద ముఖ్యమంత్రి కుమారస్వామి ఎప్పుడు పౌరులను గౌరవించరు” అంటూ బిజెపి దయ్యబట్టింది.