వాజపెయితో పివిని గుర్తు చేసుకొంటున్న నెటిజన్లు

పలు సందర్భాలలో తన పార్టీ సహచరుల ధోరణి పట్ల అసహనం వ్యక్తం చేసినా, అసమ్మతి తెలిపినా మాజీ ప్రధాని వాజపేయి మృతి చెందగానే మొత్తం బీజేపీ శ్రేణులు కదలి వచ్చి ఘనంగా నివాళులు అర్పించడం, పైగా దేశంలో విభిన్న రాజకీయ అభిప్రాయలు గలవారు కుడా వచ్చి అంత్యక్రియలలో పాల్గొనడం చూస్తున్న వారికి గతంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరించిన అవమానకర ధోరణి గుర్తుకు వస్తున్నది. సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఈ విషయమై కాంగ్రెస్ నాయకత్వంపై ఆగ్రవేశాలు కుడా వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ కార్యాలయంలో అంజలి ఘటించిన అనంతరం అంతిమయాత్రలో స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ కాలినడకన ముందు నడుస్తూ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. దానితో రాజకీయ విశ్లేషకులు, జాతీయ మీడియా ఈ చివరియాత్రను నాటి ప్రధాని పీవీ చరమాంకంలో జరిగిన సంఘటనలను పోలుస్తూ సోషల్‌మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ అటల్‌జీకి తన అంతిమయాత్రలో బీజేపీ న్యాయం చేస్తున్నది. కానీ, దివంగత మాజీ ప్రధాని పీవీ విషయంలో కాంగ్రెస్ ఇప్పటివరకూ ప్రాయశ్చితం చేసుకోలేకపోయింది. భారత్‌కు చెందిన గొప్ప ప్రధానుల జాబితాలో అటల్‌జీకి తగిన గౌరవం దక్కింది అంటూ వ్యాఖ్యానించారు.

సరిగ్గా 14 ఏళ్ళక్రితం 2004, డిసెంబర్ 23న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(83) కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్‌కు అసమాన సేవలందించిన తెలుగు తేజానికి అంతిమ కాలంలో జరిగిన అవమానాలు అన్నీఇన్నీ కావు. పీవీ పార్థివదేహాన్ని దేల్హిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి రానీయనే లేదు. ముక్కుతుడుపుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాళులు అర్పించి వెంటనే భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తరలించాలంటూ కుటుంబసభ్యులపై ఒత్తిడిచేశారు.

 

కానీ, పీవీకి ఢిల్లీలోనే అంత్యక్రియలు నిర్వహించి, స్మారకాన్ని నిర్మించాలంటూ ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు తెగేసి చెప్పారు. అయితే  సోనియా ఆంతరంగికులు చక్రం తిప్పి బలవంతంగా పీవీ పార్థివదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. పీవీకి నెక్లెస్ రోడ్డులో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రకు గాంధీ కుటుంబసభ్యులెవరూ హాజరుకాలేదు. దేశ చరిత్రలో ప్రధానిగా పనిచేసిన వ్యక్తికి ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించని, స్మారకాన్ని ఏర్పాటుచేయని పరిస్థితి ఒక్క పీవీకే ఎదురైంది.

అదే మొన్న ఆగస్టు 8న గాంధి కుటుంభానికి సన్నిహితుడైన ఆర్‌కే ధావన్ కన్నుమూస్తే  ఆయన భౌతికకాయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించి సోనియా, రాహుల్‌తో సహా అగ్రనేతలందరూ క్యూ కట్టి నివాళులర్పించారు. ఈ సంఘటనపై ఇటీవల సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ ప్రధాని పీవీ భౌతికకాయాన్ని నాడు కనీసం పార్టీ కార్యాలయం మెట్లు కూడా ఎక్కనివ్వలేదంటూ మండిపడ్డారు. ధావన్‌ను గౌరవించి, పీవీని అవమానిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

గుజరాత్ అల్లర్ల సందర్భంగా తనపట్ల నాటి ప్రధానిగా వాజపేయి కొంత అసహనం ప్రకటించిగా పార్టీ తనను ప్రధాన అభ్యర్ధిగా ప్రకటించగానే మోడీ మొదటగా వాజపేయి ఇంటికే వెళ్ళారు. ప్రధానిగా పగ్గాలు స్వీకరించిన అనంతరం కూడా అటల్‌జీ ఆశీర్వాదాలు తీసుకుని ఆయన తమకు పెద్దన్న అనే విషయాన్ని చాటారు. అటల్‌జీ పుట్టిన రోజైన డిసెంబర్ 25ను సుపరిపాలన దినోత్సవంగా కూడా ప్రకటించి తన భక్తిని చాటుకున్నారు.

అనారోగ్యంతో ఏయిమ్స్‌లో చేరిన అటల్‌జీ ఆరోగ్యపరిస్థితిని నిత్యం వాకబు చేస్తూ గురుభక్తిని ప్రదర్శించారు. ఇదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పీవీ విషయంలో తను చేసిన పొరపాట్లను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపడుతుందా?తన తప్పులను సరిదిద్దుకుంటుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.