ఎపిలో నేటి నుండి బిజెపి `భూ దీక్ష’లు

తెలుగు దేశం పార్టీ వైఫల్యాలు, ముఖ్యంగా భూ ఆక్రమణలు, అక్రమ గనుల త్రవ్వకం, అక్రమ ఇసుక తరలింపు, రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిని అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం వంటి అంశాలపై సోమవారం నుండి ఆరు రోజుల పాటు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా `భూ దీక్షలు’ చేపట్టడుతున్నది. మొదటగా, సోమవారం విజయవాడ ధర్నా చౌక్‌లో భూ దీక్ష చేయాలని నిర్ణయించింది.

గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో  రాష్ట్రం ప్రభుత్వ భూ దాహానికి వ్యతిరేకంగా ఈ నెల 19 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు.

‘‘రాష్ట్రంలో టీడీపీ పాలనలో భూ కుంభకోణాలు పెరిగిపోయాయి. డబ్బులు తీసుకొని అవసరానికి మించి పలు కంపెనీలకు భూమిని ధారాదత్తం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. 24 వరకూ వివిధ రూపాల్లో ఆందోళనలను కొనసాగిస్తాం’’ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమావేశం తఃర్వత మీడియాకు తెలిపారు.

రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ పాల్గొన్నారు. ఎంపీ హరిబాబు, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ , ఎంపి మురళీధరన్, సహా ఇన్ చార్జ్ సునీల్‌ దేవధర్‌, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహరావు, మాజీ కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, ఎంపి కె హరిబాబు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో భూపరిరక్షణ పేరుతో సాగే ఆందోళనల కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

చంద్రబాబు ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా భూములు తీసుకుని రైతులకు అన్యాయం చేసిందని సత్యమూర్తి విమరించారు. రాష్ట్ర ప్రజలు అవినీతిని ఏమాత్రం సహించబోరని హెచ్చరిస్తూ, తన ప్రభుత్వం ఎటువంటి అక్రమాలకు పాల్పడని పక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిబిఐ దర్యాప్తులకు ఎందుకు భయపడుతున్నారని విస్మయం వ్యక్తం చేసారు.

తెలుగు దేశం పాలనలో పెరిగిపోయిన అవినీతిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంతో పాటు కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ప్రజలకు వివరించే కార్యక్రమం చేబడుతున్నట్లు తెలిపారు.

కాగా, 2019 ఎన్నికలకు ముందుగా,  వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహిస్తామని, దీనికి ‘వికాస్‌యాత్ర’గా పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ అవినీతిని ఈ యాత్ర ద్వారా ఎండగడతామని చెప్పారు. అభివృద్ధి అంటే అమరావతిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.