ప్రజకూటమిలో పలు చోట్ల `స్నేహపూర్వక’ పోటీలు

ప్రజాకూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య `స్నేహపూర్వక పోటీ’ పలు చోట్ల అనీవార్యంగా కనిపిస్తున్నది. పలు చోట్ల తిరుగుబాటు అభ్యర్ధులు కుడా పోటీ చేస్తున్నారు. అధికారికంగా భాగస్వామ్య పక్షాలకు కేటాయించిన సీట్లలో గత రాత్రి అకస్మాత్తుగా కాంగ్రెస్ తమ అభ్యర్ధులకు బి ఫారంలు ఇవ్వడం పట్ల పక్షాల మధ్య కలకలం రేగుతున్నది.

ప్రజాకూటమిలో కుదిరిన ఒప్పందం కన్నా ఐదు చోట్ల అభ్యర్థులను కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. టీజేఎస్‌కు ఇచ్చిన మూడు, టీడీపీకి ఇచ్చిన రెండు చోట్ల అభ్యర్థులకు పార్టీ బీఫామ్స్ ఇచ్చింది. టీజేఎస్‌కు కేటాయించిన మూడు స్థానాల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో గాయత్రి రవి, మిర్యాలగూడలో ఆర్‌. కృష్ణయ్య, దుబ్బాకలో మద్దుల నాగేశ్వరరెడ్డికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి బి ఫారంలను స్వయంగా ఇచ్చారు.

అలాగే టీటీడీపీ ఇచ్చిన రెండు స్థానాల్లో ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్‌రెడ్డి, రంగారెడ్డి-పటాన్‌చెరులో కాట శ్రీనివాసగౌడ్‌కు బీఫామ్ లను అందజేశారు. టీజేఎస్‌ తరపున నిలబడ్డ అభ్యర్థులు బలహీనంగా ఉన్నారని, టీజేఎస్ నుంచి పోటీ చేస్తే ఆ స్థానాలు టీఆర్ఎస్‌కు వెళ్లే అవకాశం ఉందనే సాకుతో ఈ విధంగా చేసిన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.  

మరోవంక తెలంగాణ జన సమితి మొత్తం 14 స్థానాల్లో నామినేషన్లు వేస్తున్నది.  ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా తమకు 8 స్థానాలను మాత్రమె కాంగ్రెస్‌ సర్దుబాటు చేయగా, వీటికి అదనంగా మరో ఆరు స్థానాల్లోనూ అభ్యర్థులను టిజేఎస్ బరిలోకి దిన్చుతున్నది. ఆ పార్టీ తాజాగా ప్రకటించిన మహబూబ్‌నగర్‌ స్థానంతో పాటు ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, చెన్నూరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌, అశ్వారావుపేట స్థానాల్లోనూ తమ అభ్యర్థులతో నామినేషన్‌ వేయించాలని నిర్ణయించింది.

మహబూబ్‌నగర్‌, అశ్వారావుపేట స్థానాల్లో టిడిపి అభ్యర్థులను ప్రకటించగా, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, చెన్నూరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పుడు ఈ స్థానాల్లో టిజేఎస్ అభ్యర్థులను నిలపాలని నిర్ణయించడంతో కూటమి పక్షాల మధ్య స్నేహపూర్వక పోటీ తప్పదని స్పష్టం అవుతున్నది.

అధికారికంగా పలు చోట్ల ఒక వంక `స్నేహపూర్వక’ పోటీలకు దిగుతూ ఉండగా, మరి కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలు మిత్ర పక్షాలకు కేటాయించిన చోట్ల సహాయ నిరాకరణకు సిద్దపడుతున్నారు. కొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్ధులుగా నామినేషన్లు వేస్తున్నారు.